రాష్ట్ర విభజనపై మోడీ వ్యాఖ్యలు

 

బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఇటీవల ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిలో మార్పును సూచిస్తున్నట్లున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా బాధ కలిగించే విధంగా రాష్ట్ర విభజన చేస్తోందని, అది చూస్తే ప్రజాభీష్టం మేరకు రాష్ట్ర విభజన చేస్తున్నట్లు కాక, కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ‘విభజించు,పాలించు’ విధానాన్ని అమలు చేస్తునట్లు ఉందని మోడీ అన్నారు. ఇదివరకు తమ ఎన్డీయే హయంలో కూడా మూడు రాష్ట్రాల విభజన జరిగిందని, కానీ అప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలకు పూర్తి ఆమోదయోగ్యంగా విభజన జరిగిందని అందుకు రెండు ప్రాంతాల ప్రజలు కూడా చాలా సంతోషించారని ఆయన అన్నారు.

 

ఆ మధ్య ఒకసారి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పిన మాటలకీ ఇప్పడు మాట్లాడుతున్న మాటలకీ చాలా తేడా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలు ఏర్పాటు జరిగితే రెండు ప్రాంతాలు అభివృద్దిలో ఒకదానితో మరొకటి పోటీ పడగలవని ఆనాడు అంటే, ఇప్పుడు విభజన ప్రజలకు బాధ కలిగించే రీతిలో జరుగుతోందని అన్నారు.

 

ఆయన పర్యటన తరువాత మెహబూబ్ నగర్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన సీనియర్ బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ‘తమ పార్టీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తుందని’ ప్రకటించారు. కానీ, ఇప్పుడు మోడీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ ఏవిధంగా వ్యవహరించబోతోందో చూచాయగా తెలుపుతోంది.

 

కాంగ్రెస్ పార్టీ కూడ బహుశః ఇది పసిగట్టే ఉండవచ్చును. అయినా ఏమి తెలియనట్లుగా వ్యవహరిస్తూ పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతోంది. అంటే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టి, దానికి బీజేపీ మద్దతు ఈయకపోతే ఆపార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు అర్ధం అవుతోంది. కానీ తను ప్రవేశపెట్టిన బిల్లుని గెలిపించుకోవలసిన బాధ్యత కూడా కాంగ్రెస్ మీదే ఉంది. గనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొనే ఉందనుకోవాల్సి ఉంటుంది.