TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నరసన్నపేట టిక్కెట్ బాలయ్యకు ఇస్తారా?

Published on: Wed Mar 28, 2012 10:13AM

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి బాలకృష్ణ పోటీ చేయవచ్చునంటూ ఊహాగానాలు వస్తున్నాయి. దీనికితోడు ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలుసుకున్న శ్రీకాకుళం జిల్లా నేతలు కొందరు బాలయ్యను నరసన్నపేటలో రంగంలోకి దింపాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ పరిణామం చంద్రబాబునాయుడికి ఒకింత కలవరం కలిగించింది. ఇక్కడ పోటీ చేయడానికి కింజరాపు ఎర్రంనాయుడుగాని ఆయన సోదరుడు అచ్చంనాయుడుగాని ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం అక్కడి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా ఉండటమే. ఈ పరిస్థితుల నేపథ్యంలో అత్యుత్సాహపరులైన కొందరు నాయకులు బాలయ్యపేరుని నరసన్నపేట నియోజకవర్గానికి ప్రతిపాదించడం చంద్రబాబునాయుడుకు ఇబ్బందిని కలిగించింది.

 

ఒకవేళ ఇటువంటి అత్యుత్సాహపరులు బాలయ్యను కలిసి మీరు బరిలోకి దిగండి మేం గెలిపించేస్తాం అని చెబితే, వారి మాటలు బాలయ్య వింటే తనకు తలనొప్పులు తప్పవని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అందుకే ఆయన ఇటువంటి అంశాలను మొగ్గలోనే తుంచివేయడానికి ప్రయత్నించారు. ఈ అత్యుత్సాహపరులు బాలయ్య పేరు చెప్పిన వెంటనే చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పార్టీ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని, అభ్యర్థి ఎవరైనా పార్టీ విజయంకోసం శ్రమించాలని గట్టిగా చెప్పి ఆ చర్చను అంతటితో ముగించారు. తరువాత ఈ నాయకులకు చంద్రబాబునాయుడు ప్రైవేటుగా క్లాస్ పీకినట్లు తెలిసింది. ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడేటప్పుడు వెనకా ముందూ ఆలోచించాలని వారికి చెప్పినట్లు తెలిసింది.