TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మల్లాది ఆవేశానికి కారణాలు ఏమిటో?

Published on: Fri Mar 30, 2012 10:29AM

నందిగామ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు, తన సహచర శాసనసభ్యుడైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన మల్లాది విష్ణుపై పోలీసు కేసు నమోదు చేయడం కృష్ణాజిల్లాలో పెద్దచర్చనీయాంశంగా మారింది. ఒక శాసన సభ్యునిపై మరొక శాసన సభ్యుడు పోలీసు కేసు పెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం కావడమే కాకుండా ఇరువురు కృష్ణాజిల్లాకు చెందినవారే కావడం విశేషం. గృహనిర్మాణ శాఖకు సంబంధించి హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో తనపైకి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ తంగిరాల ప్రభాకరరావు పోలీసు కేసు పెట్టారు. అయితే సమావేశంలో శాసనసభ్యుడు విష్ణు ఆవేశపడటానికి, ప్రభాకర్ పోలీసు కేసు పెట్టడం వెనుక ఇతరత్రా అంశాలు వున్నాయని, గృహ నిర్మాణ సమావేశం ఒక సాకు మాత్రమేనని జిల్లాకు చెందిన ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

 

2009లో జరిగిన ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో వున్న 16 స్థానాలకుగాను మెజారిటీ స్థానాల్లో అంతే జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గుడివాడ, కైకలూరు, నూజివీడు, గన్నవరం, అవనిగడ్డ (8)లలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించగా, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల నుంచి పి ఆర్ పి, విజయవాడ సెంట్రల్, తిరువూరు, మచిలీపట్నం, పెడన, పామర్రు, పెనమలూరులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల పి ఆర్ పి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన నేపథ్యంలో కృష్ణాజిల్లా అధికార, ప్రతిపక్ష సభ్యుల సంఖ్యంగా చేరిసమం అయ్యింది. సభ్యుల సంఖ్య చేరిసమం అయినప్పటికీ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, మైలవరం శాసనసభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావుకు అధికార పార్టీ శాసనసభ్యుల కంటే ఎక్కువగా గుర్తింపు వుంది. దేవినేనికి నందిగామ శాసన సభ్యుడైన తంగిరాల ప్రభాకరరావు, అత్యంత సన్నిహితులు. జిల్లాలో జరిగే ఏ కార్యక్రమంలో అయినా తంగిరాల, దేవినేనితో కలిసి పాల్గొనడమే కాకుండా అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులను విమర్శించడంలో, వారిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడటంలో ముందుంటారు. కృష్ణాజిల్లాలో ఒక విధంగా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్ లతోపాటు మంత్రి కె.పార్థసారధి ఒక జట్టుగా వ్యవహరిస్తుండగా ప్రతిపక్ష పార్టీకి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల ప్రభాకరరావు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్యలు ఒక జట్టుగా వ్యవహరిస్తూ ఏ చిన్న అవకాశం వచ్చినా పరస్పరం ఒకరిపై మరొకరు మాటలతో దాడి చేసుకోవడం ఆనవాయితీగా మారింది. తెలుగుదేశంపార్టీకి చెందిన నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య ప్రసంగంతో సమావేశంలో రగడ ప్రారంభమైనా అది చివరకు పార్టీల మధ్య, ఆ తర్వాత వ్యక్తుల మధ్య రగడగా మారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.