ఘనంగా అన్నగారి జయంతి

 

మే 28 వచ్చిందంటే తెదెపా శ్రేణులకు పండగే! పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ జన్మదినమైన ఈ రోజుని తెదెపా నేతలు ఘనంగా జరుపుకొంటారు. ఏటా జరిగే తంతే అయినా ఈసారి ఎన్టీఆర్‌ హవా మరింత తీవ్రంగా ఉన్నట్లు తోస్తోంది. తిరుపతిలో కొనసాగుతున్న మహానాడులో ఇవాళ ఎన్టీఆర్‌ని పదేపదే తలచుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీనికంతటికీ కారణం లేకపోలేదు. ఇష్టం ఉన్నా లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది. దాని వల్ల ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోతుందన్న తెలుగు ప్రజల భయంతో ఏకీభవించిన మోదీ ప్రత్యేక హోదా మొదలుకొని బడ్జెట్లో లోటుని పూడ్చడం వరకూ రకరకాల హామీలను తెగ గుప్పించేశారు. కేంద్రం అండగా ఉందన్న ఆశతో చంద్రబాబు రాజధాని మొదలుకొని, బడ్జెట్‌ వరకూ అంతా భారీగా ప్రణాళికలు వేశారు. ఒక పక్క ఉద్యోగులు మరోపక్క ప్రతిపక్షాలు సహకరించకున్నా... ఇంచుమించుగా ఆకాశానికి నిచ్చెనలు వేశారు. కానీ రోజులు గడిచేకొద్దీ కేంద్రం మొండిచేయి స్పష్టంగా కనిపించసాగింది. తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఆంధ్రులను నమ్మించి వంచించారన్న భావం సర్వత్రా నెలకొంది. ఇలాంటప్పుడు ఎన్టీఆర్‌ గుర్తుకురావడంలో తప్పేముంది. స్వాత్రంత్ర్యం వచ్చిందగ్గర్నుంచీ మదరాసీగానే కొనసాగుతున్న తెలుగువాడికి జాతీయ స్థాయిలో ఒక గౌరవాన్ని అందించినవాడు ఎన్టీఆర్‌. ఇప్పుడు అలాంటి గౌరవాన్నీ, గుర్తింపునీ మరోసారి తెలుగువాడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈసారి కేవలం తెదెపా శ్రేణులే కాదు, ఆంధ్రులు యావత్తూ ఎన్టీఆర్‌ వైపు చూస్తున్నారు.