నాగమన్నా అట్టా ఆగం సేయకే

 

ఇటీవల మీడియాలో తెరాస మరియు తెలంగాణా జేయేసిలకు వ్యతిరేఖంగా మళ్ళీ మరోసారి నిప్పులు కక్కిన నాగం జనార్ధన్ రెడ్డిని మంచి చేసుకొనే ప్రయత్నంలో పడ్డారు తెరాస నేతలు. నిన్నగాక మొన్న ఉద్యమంలోకి వచ్చి, తెరాసలో చేరిపోయి వెన్వెంటనే తెలంగాణా జేయేసి కూడా స్థానం సంపాందించడమే గాకుండా మొన్న శాసన మండలి సభ్యుడిగా కూడా పదోన్నతి పొందిన స్వామీ గౌడ్, నాగం ఆగం ఎందుకో గ్రహించలేకపోలేదు.

 

అందుకే , ఇటీవల టీఎన్‌జీవోభవన్‌లో నిర్వహించిన జేఏసీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన నాగం జనార్ధన్ రెడ్డిని ‘పదవీత్యాగం చేసిన మహానేత, తెలంగాణా ఉద్యమంలో కీలక వ్యక్తీ’ అంటూ తెగ పొగిడేశారు. నాగం తెలంగాణా జేయేసిలో సభ్యుడు కాకపోయినా, తాము ఆయనని జేయేసీలో అంతర్భాగంగానే చూస్తున్నామని అందుకే ఆయన చేపట్టిన భరోసా యాత్రకు మద్దతు తెలిపామని అన్నారు. ఇకపై జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు నాగమన్నను తప్పక ఆహ్వానిస్తామని అన్నారు. ఒకవైపు కేసీఆర్, ప్రొఫసర్ కోదండరామ్ తనను తెలంగాణా జేయేసిలోకి రాకుండా అడ్డుకొంటున్నారని మీడియా ముందు బాహాటంగానే చెపుతున్న నాగం జనార్ధన్ ప్రచారం వల్ల తనకీ, తెరాసా పార్టీకి, తెలంగాణా జేయేసికి కూడా కొత్త సమస్యలు ఎదురవుతాయనే భయంతోనే స్వామీ గౌడ్ ఆయనను మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

 

అయితే, తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన కేసీఆర్, ప్రొఫసర్ కోదండరామ్ ల అభీష్టానికి వ్యతిరేఖంగా స్వామీగౌడ్ నాగం జనార్ధన్ రెడ్డిని జేయేసిలోకి ఆహ్వానించడం సాధ్యం కాకపోవచ్చును. ఒకవేళ, నాగం అందుకు సిద్దపడినా ఇప్పటికీ ఆయనని అనుమానంగా చూస్తున్న కేసీఆర్ అంగీకరించకపోవచ్చును. తత్ఫలితంగా, నాగం ముందే చెపుతున్నట్లు స్వయంగా కొత్త రాజకీయ పార్టీని స్తాపించడమో లేక బీజేపీలో చేరడమో జరగవచ్చును. అప్పుడు తెరాసకు నాగం జనార్ధన్ రెడ్డి నుంచి మరిన్నికొత్త సవాళ్ళు ఎదురయే అవకాశం ఉంది.