ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ ఇక లేరు

 

తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో 1200 చిత్రాలకు సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో మల్లార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎం.యస్.విశ్వనాథన్ కేరళలో పాలక్కడ్ కు చెందిన ఇలప్పుళి గ్రామంలో 1928, జూన్ 24న జన్మించారు. చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయనకి నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి మనయంగాత్ సుబ్రమణియన్ మరణించడంతో తాతగారి వద్ద పెరిగారు. కానీ వారిది చాలా పేద కుటుంబం కావడంతో ఆ లేత వయసులోనే విశ్వనాథన్ గారు స్థానిక సినిమా హళ్ళలో తినుబండారాలు అమ్ముతూ జీవించాల్సిన భయానకమయిన దుస్థితి ఏర్పడింది. కానీ దాని వలన ఆయన సినీ ప్రపంచం వైపు ఆకర్షితులయ్యే అవకాశం కలిగింది. అప్పటి నుండే ఆయనకు సినిమాలలో నటించాలని, పాటలు పాడాలనే కోరిక మొదలయింది.

 

ఆ తరువాత ఆయన అనేక నాటకాలలో నటించారు కూడా. కానీ ఆయనలో దాగి ఉన్న సంగీత ప్రతిభను గుర్తించిన నీలకాండ భాగవతార్ ఆయనను చేరదీసి సంగీతం నేర్పించారు. 1933 నుండి 1939సం.వరకు ఆయన వద్ద సంగీతం నేర్చుకొన్నారు. ఆ తరువాత ఆయన యస్.వి. వెంకట్రామన్, యస్.ఎం.సుబ్బయ్య, సి.ఆర్. సుబ్బురామన్, టి.ఆర్. రామమూర్తి, టిజి.లింగప్ప తదితర ప్రముఖ సంగీత విద్వాంసుల బృందాలలో పనిచేసి సంగీతంలో మెళుకువలు ఆకళింపు చేసుకొన్నారు. 1952లో సి.ఆర్. సుబ్బురామన్ ఆకస్మికంగా మరణించడంతో ఆయన వద్ద పనిచేస్తున్న సంగీత దర్శకుడు రామ్మూర్తితో కలిసి ఎం.యస్.విశ్వనాథన్ సుబ్బురామన్ అంగీకరించిన దేవదాసు,చండీరాణి, మరుమగల్ మొదలయిన సినిమాలకు సకాలంలో అద్భుతమయిన సంగీతం అందించడంతో ఆయన సినీ ప్రస్తానం మొదలయిందని చెప్పవచ్చును. వాటిలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన దేవదాసు సినిమాకు ఎం.యస్.విశ్వనాథన్ సంగీతం అందించారు. ఆ చిత్రంలో ‘జగమే మాయ బ్రతుకే మాయ’ అనే పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు.

 

ఆయన తెలుగులో కేవలం 31 సినిమాలకు మాత్రమే సంగీతం అందించినప్పటికీ, తెనాలి రామకృష్ణ, ఆకలి రాజ్యం, మరో చరిత్ర, అంతులేని కధ, అందమయిన అనుభవం, చిలకమ్మా చెప్పింది, ఇది కధ కాదు,గుప్పెడు మనసు, కోకిలమ్మ వంటి సినిమాలకు అందించిన అపూర్వమయిన బాణీలతో తెలుగు సినీ సంగీతం ప్రపంచంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఫిలిం ఫేర్ జీవిత కాల పురస్కారం(2001), పరమాచార్య అవార్డు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమయిన కలైమణి అవార్డు వంటి అనేక అవార్డులు ఆయన అందుకొన్నారు. అజరామరమయిన సంగీతాన్ని అందించిన ఎం.యస్.విశ్వనాథన్ ఇకలేరు అని తెలియగానే సంగీత ప్రియులు చాలా బాధపడుతున్నారు. ఆయన అంత్యక్రియలు రేపు చెన్నైలో నిర్వహించబడతాయి.

 

https://www.youtube.com/playlist?list=PLvS3k4MyaWFfomd76mt2iP6Rr2NkXRdAR

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu