ముకేష్ అంభానీకి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు సమంజసమేనా

 

దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయేతర వ్యక్తికి ‘జెడ్’ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థల అధిపతి ముకేష్ అంభానీకి త్వరలో ఈ సౌకర్యం కలుగనున్నది. రెండు నెలల క్రితం ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల నుండి అందిన లేఖలో, జైలులో ఉన్న తమ అనుచరుడు డానిష్ అనే ఉగ్రవాదిని వెంటనే విడిచిపెట్టకపోతే, దక్షిణ ముంబై అల్టామౌంట్ రోడ్డులో ఆయన కట్టుకొన్న 27అంతస్తుల ఆంటిల్ల భవనాన్ని పేల్చివేస్తామని హెచ్చరించడంతో, ఆయన తనకు రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వాన్నికోరడంతో హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. ఆయనకు రక్షణ కల్పించేందుకు అత్యాధునిక ఎస్కార్ట్ వాహనాలు మరియు దాదాపు 25మంది బ్లాక్ క్యాట్ కమెండోలు త్వరలో హోంమంత్రిత్వ శాఖ కేటాయించనుంది.

 

కానీ, ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంపట్ల సీఆర్పీయఫ్ అధికారులు మాత్రం కొంచెం అసంతృప్తి ప్రకటిస్తునట్లు సమాచారం. తాము నక్సలైట్లను నియoత్రణ కొరకు ఇప్పటికే తగిన సిబ్బంది లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు కొత్తగా ఈ బాధ్యతలు కూడా అప్పగిస్తే తమపై మరింత భారం పడుతుందని, ఇటువంటి పనులకు ప్రత్యేకంగా నియమింపబడిన సి.ఐ.యస్.యఫ్ సేవలను ఉపయోగించుకొంటే బాగుంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు.

 

అదేవిధంగా, అంభానీ నివాసముండే అల్తామౌంట్ రోడ్డులోఉన్న తమ భవనానికి, తమకు రక్షణ కొరకు ఒక ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయమని అంభానీ ముంబై పోలీసులను కోరడంతో, వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రదేశంలో పోలీసు స్టేషన్ నిర్మించడానికి అవసరమయిన స్థలం సంపాదించడం, పోలీసు స్టేషన్ నిర్వహించడం తమ తలకు మించిన భారం అని వారు చెప్పినప్పుడు అంభానీ తన భవనంలోనే క్రిందన కొంత స్థలం ఇవ్వజూపినా వారు సాంకేతిక కారణాలతో నిరాకరించినట్లు సమాచారం. కానీ, ఇప్పుడు కేంద్రం ఏకంగా ఆయనకు జెడ్ కేటగిరి రక్షణ కల్పించడంతో ఆయన కొరకు ఇప్పుడు ప్రత్యేకoగా ఒక వ్యవస్థే ఏర్పాటు అవుతోంది.

 

దేశంలో అత్యధిక పన్నులు చెల్లిస్తు, భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నముకేష్ అంభానీ వంటివారు రక్షణ కోరడం, అందుకు ప్రభుత్వం అంగీకరించడం రెండూ కూడా సమజసమే. కానీ రేపు దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది ప్రముఖులలో కొన్ని వందల మంది నుండి ఇటువంటి విన్నపాలే వచ్చినట్లయితే అప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది? అంభానీకి రక్షణ కల్పించి మిగిలిన వారికి కల్పించలేమని చెప్పగలదా? ఒక వేళ తప్పసరి పరిస్తితుల్లోకల్పించవలసి వస్తే ఆ భారం ప్రభుత్వం భరించగలదా? అని ప్రభుత్వం కూడా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది.

 

ఇటువంటి ప్రముఖులకు రక్షణ కల్పించవలసిన బాధ్యతా ప్రభుత్వం మీద ఉన్నపటికీ, అటువంటి ప్రత్యేక సేవలు అందిస్తున్నoదుకు, పూర్తి ఖర్చులను వారి వద్ద నుండే వసూలు చేయడం వలన ప్రభుత్వం మీద కనీసం కొంత భారం తగ్గుతుంది. ఆలా కాకుండా అంభానీలతో తమకు, తమ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను, అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఉచిత సేవలు అందించడం మొదలుపెడితే, రేపు మిగిలిన వారు కూడా జెడ్ క్యాటగిరీ రక్షణ కోరుతూ హోంమంత్రిత్వ శాఖా ముందు క్యూకట్టే ప్రమాదం ఉంది.

 

మన రాజకీయనాయకులకు ముందు వెనుకా ఎస్కార్ట్ వాహనాలు, తిరగడానికి ఎర్రబుగ్గ కార్లు, బాత్రూం కి వెళ్ళాలన్నా వెనుక బ్లాక్ క్యాట్ కమెండోలు ఉండటం ఒక గౌరవ చిహ్నంగా భావిస్తున్న ఈ తరుణంలో ఇటువంటి ఉచిత జెడ్ క్యాటగిరి రక్షణ సేవలు అందించడం అటువంటి వారిని ప్రోత్సాహించడమే అవుతుంది. కనుక, రిలయన్స్ తన ప్రతీ సేవకు ప్రజల దగ్గర నుండి తగిన మూల్యం వసూలు చేస్తున్నట్లే ప్రభుత్వం కూడా వారి నుండి వసూలు చేయడం మేలు.

 

ఒకవేళ ఇటువంటి అభ్యర్ధనలు ఇంకా వచ్చినట్లయితే, ఇదే ప్రాతిపాదికన వ్యవహరించి వారి రక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే అనేక మంది యువకులకు ఉపాధి కూడా లభిస్తుంది.