Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాపు ఉద్యమనేత‘ ముద్ర’గాయెబ్ పద్మనాభం!
posted on: May 3, 2024 4:55PM
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది. చంద్రబాబుపై కోపమో.. పవన్ కల్యాణ్ నన్ను మించి ఎదిగిపోతాడనే భయమో కానీ, ముద్రగడ పద్మనాభం గజిబిజి అయిపోతున్నారు. పవన్ కల్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గంలో ఓడించడమే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా ఊగిపోతున్నాడు. పవన్ ను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కూడా ముద్రగడ పద్మనాభంలా వ్యక్తిగతంగా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ముద్రగడకు పవన్, చంద్రబాబుపై కోపాన్ని వైసీపీ అధినేత చక్కగా వాడేసుకుంటున్నారు. అమ్మోరు వద్ద బలికి ఇచ్చే మేకపోతులా ముద్రగడను వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో వైసీపీ గెలిచినా ముద్రగడకు పెద్దగా ఉపయోగం ఉండకపోగా, వైసీపీ ఓడిపోతే చిక్కుల్లో పడేది ముద్రగడనే అనే వాదన ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ముద్రగడ కుమార్తె క్రాంతికి అర్ధమైంది. తన తండ్రి ముద్రగడ పద్మనాభం తీరును పట్ల ఆమె అసహనం వ్యక్తంచేస్తూ ఏకంగా వీడియోను రిలీజ్ చేశారు. తన తండ్రిని జగన్, ఆయన టీం బాగా వాడుకుంటున్నారని, జగన్ మా నాన్నను వాడుకొని వదిలేయడం ఖాయమని చెప్పేశారు.
ఏపీలో కాపులకు పెద్ద మనిషిలా ముద్రగడ పద్మనాభం చలామణి అవుతున్నారు. ముద్రగడ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఏపీలోని కాపులందరూ అటువైపు ఉంటారనే అర్ధంపర్ధంలేని వాదన కూడా ఉంది. కానీ వాస్తవం ఏమిటంటే.. ముద్రగడ ఏ పార్టీకి సపోర్టు చేస్తే ఆ పార్టీకి మెజార్టీ కాపులు వ్యతిరేకం అవుతారు. ఈ విషయం పలుసార్లు రుజువైంది. అయినా, తానే కాపు సామాజికవర్గానికి పెద్దగా ఉండాలని ముద్రగడ తెగ ఆరాటపడిపోతుంటారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో గందరగోళానికి గురైన ముద్రగడ.. మళ్లీ పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదుగుతుంటేకూడా తెగ కంగారు పడిపోతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా బలపడితే కాపులందరూ తనను మర్చిపోతారేమోనన్న భయం ముద్రగడలో స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో, పవన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ముద్రగడ ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఛాలెంజ్ సైతం చేశాడు. పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించక పోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చేసుకుంటానని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఎవరైనా ఇలా మాట్లాడతారా. పవన్ పై ఎంత కోపం ఉంటే ముద్రగడ కులాన్నే మార్చేసుకునే స్థాయికి వెళ్లిపోతారు. ముద్రగడ ప్రస్తుత మానసిక పరిస్థితిని చూసి ఆయన సొంత సామాజికవర్గం వారే జాలిపడుతున్నారు. జగన్ శిబిరంలో బలి పశువుల్లో ఒకరిగా ముద్రగడను చూస్తున్నారు. ముద్రగడ తీరుతో ఆయన కుమార్తె సైతం విసుగెత్తిపోయినట్లున్నారు. ఆమె ఏకంగా వీడియోను రిలీజ్ చేశారు.
ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తన తండ్రి తీరును తప్పుబట్టారు. కేవలం పవన్ కల్యాణ్ ను తిట్టించేందుకే సీఎం జగన్ తన తండ్రిని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే పద్మనాభం రెడ్డిగా పేరుమార్చుకుంటానని మా నాన్న అనడం బాధాకరమైన విషయం. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అస్సలు అర్ధం కాలేదు. వంగా గీతను గెలిపించేందుకు కష్టపడొచ్చు.. కానీ, పవన్, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు అంటూ ముద్రగడ కుమార్తె తండ్రికి సుద్దులు చెప్పారు. ఈ విషయంలో నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా.. పవన్ గెలుపుకోసం నా వంతు కృషి చేస్తానంటూ ముద్రగడకు గట్టి షాక్ ఇచ్చారు ఆయన కుమార్తె కావ్య.
కుమార్తె క్రాంతి చేసిన వ్యాఖ్యలపై పద్మనాభం స్పందించారు. జనసేన నాయకులు తన కుటుంబంలో చిచ్చుపెట్టారని, తన కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడని శాపనార్ధాలు పెట్టారు. నా కూతురుతో కూడా నాపై తప్పుడు ప్రచారం చేయించారు. నా కుమార్తెకి ఎప్పుడైతే పెళ్లయిందో అప్పటి నుంచి ఆమె తన ప్రాపర్టీ కాదని, తన కుమారుడు మాత్రమే తన ప్రాపర్టీ అంటూ పద్మనాభం మాట్లాడటం చూస్తుంటే.. పవన్ పై కోపాన్ని కక్షగా మార్చడంలో జగన్ శిబిరం ముద్రగడకు ఏ స్థాయిలో శిక్షణ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి పవన్ కల్యాణ్ పట్ల ముద్రగడ ప్రవర్తిస్తున్న తీరుతో జనసైనికులతో పాటు కాపు సమాజం మొత్తం చీదరించుకుంటున్న పరిస్థితి.
ముద్రగడలాంటి పాత కాపులను వైసీపీ ప్రయోగిస్తోంది. సీరియస్ నేతగా ఇంతకాలం తన ముద్ర నిలబెట్టుకున్న ముద్రగడ ఇప్పుడు జగన్ కోసం తనను తాను దిగజార్చుకున్నారు. అసలు ఆయన కాపు ఉద్యమ కారులకు జనసేన నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఉప్మా పెట్టాడంటూ గతంలో రాసిన లేఖతోనే కాపు సమాజంలో ఆయన ప్రతిష్ఠ పాతాళానికి దిగజారిపోయింది. అప్పట్లో కాపు యువత ఆయన ఇవిగో మేం తిన్న ఉప్మా డబ్బులు అంటూ మనీయార్డర్లు పంపించారు. అప్పడైనా ఆయనకు తన స్థితి, స్థాయి ఎంతగా దిగజారాయో అర్ధమై ఉండాల్సింది. కాలేదు. అయి ఉంటే ఇప్పుడు సొంత కుమార్తె తన తండ్రిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, ఆయనను నమ్మెద్దంటూ వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా?!






