Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వాక్ స్వాతంత్ర్యం... మదర్ థెరిసా కంటే గొప్పదా?
posted on: Sep 6, 2016 4:54PM

ఈ మద్య కాలంలో పదే పదే వినిపిస్తోన్న అత్యంత వివాదాస్పదమైన అంశం భావ ప్రకటనా స్వాతంత్ర్యం! అది వుందని కొందరు దుర్వినియోగం చేస్తే లేదని కొందరు చాలా బాధపడిపోతుంటారు! మొత్తానికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఎలాగో ఒకలా వివాదాలకి కారణం అవుతూనే వుంది! రీసెంట్ గా తన వాక్ స్వాతంత్ర్యాన్ని ఇష్టానుసారం వాడిన వివాదాస్పద వ్యక్తి.... మార్కండేయ కట్జూ!. మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అనగానే మనకు బోలెడు వివాదాలు గుర్తుకు వస్తాయి. ఆయన ఏం మాట్లాడినా వివాదమే. ఇక ఆయన సోషల్ మీడియాలో పోస్టులు దంచుకున్నాడంటే మరింత రచ్చే! ఈ సారి ఆయన టార్గెట్ మదర్ థెరిసా అయింది!.
మార్కేండయ కట్జూ ఫేస్బుక్ లో ఓ సుదీర్గమైన పోస్ట్ పెట్టాడు. దాని సారాంశం ఏంటంటే, మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ ఇవ్వటం గురించి అందరూ ఎందుకు హంగామా చేస్తున్నారని! అక్కడితో ఆగిపోతే బాగానే వుండేది. కాని, ఆయన మదర్ కు వ్యతిరేకంగా చాలా మాట్లాడాడు. అనేక సాక్ష్యాలతో మదర్ థెరిసా ఒక క్యాథలిక్ ఛాందసవాది అని నిరూపించే ప్రయత్నం చేశాడు! దీనికి నెటిజన్స్ నుంచి రియాక్షన్ ఎలా వుంటుంది అనుకుంటున్నారు? ఊహించినట్టుగానే నానా రభసా అయింది! మదర్ థెరిసా... కట్జూ చెప్పినట్టు క్రిస్టియన్ మిషనరీయా, మత వ్యాప్తికి ప్రయత్నించిందా, ఆమెకు వచ్చిన విరాళాలు ఎక్కడివి, ఆమె భావజాలం మధ్య యుగాల నాటి కరుడుగట్టిన చాందసమా... ఇలాంటివన్నీ ఎప్పుడూ వుండేవే! పైగా అవి వివాదాస్పదం కూడా! కాని, ఇక్కడ ఒక్కటే విచిత్రంగా వుంటోంది... అదే సో కాల్డ్ లిబరల్స్ అని చెప్పుకునే అభ్యుదయవాదుల వాదన!
మదర్ థెరిసా గురించి ఎవ్వరు ఏ విమర్శ చేసినా ఆమెని అభిమానిస్తామని చెప్పుకునే కొందరు తీవ్రమైన దాడి మొదలు పెడుతున్నారు. అసలు మదర్ థెరిసాను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదని వారు తేల్చేస్తున్నారు! ఆమె పేదలకు నిస్వార్థంగా సేవ చేసింది కాబట్టి ఏమీ అనకూడదంటారు! ప్రజాస్వామ్య విలువల్ని నమ్మే వారు ఎవ్వరూ దీనికి అంగీకరించరాదు! ఎందుకంటే, మతాన్ని, దేవుడ్ని కూడా విమర్శించటమే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఆదునిక అభిప్రాయం. మరి అలాంటప్పుడు మదర్ థెరిసా కూడా విమర్శకు అతీతురాలు కాదు కదా!
మార్కండేయ కట్జూ తన సుదీర్గమైన పోస్ట్ లో మదర్ థెరిసాను అనేక విధాల ప్రశ్నించాడు. ఆమె నోబుల్ ప్రైజ్ తీసుకుంటూ అబార్షన్లు ప్రపంచ శాంతికి చేటు చేస్తాయని అన్నారంటూ గుర్తు చేశాడు! ఇది చాందసవాదం తప్ప మరేం కాదని తేల్చేశాడు! ఇక వాటికన్ మదర్ కు సెయింట్ హుడ్ ఇవ్వటానికి ఒక అద్భుతం జరిగిందని అంగీకరించింది. బెంగాల్ లోని ఒక మహిళ మదర్ ఫోటో లోంచి ఒక మెరుపు వచ్చి తన ఒంట్లోకి ప్రవేశించిందని చెప్పింది. వెంటనే తనకున్న క్యాన్సర్ పోయిందని ఆమె తెలిపింది. దీన్ని గుడ్డిగా నమ్మిన వాటికన్ మదర్ థెరిసాకు సెయింట్ గౌరవం ఇచ్చేసింది.
అసలు సదరు పేషంట్ కి క్యాన్సర్ లేనే లేదని ఆమె డాక్టర్ చెప్పాడట! కాని, పోప్ డాక్టర్ మాటలు పట్టించుకోలేదు! ఇదంతా మూఢ నమ్మకం అంటాడు కట్జూ! మీడియా కూడా కావాలనే మదర్ గురించిన అనేక అనుమానాల్ని పట్టించుకోకుండా వదిలేసిందని ఆయన ఆరోపించాడు!. అసలు మదర్ థెరిసాకు విరాళాలు ఎక్క్డడ్నుంచి వచ్చాయని కూడా మార్కండేయ కట్జూ ప్రశ్నించాడు. ఎలాంటి దుర్మార్గులు డబ్బులిచ్చినా ఆమె విరాళంగా స్వీకరించిందని అన్నాడు. ఇంతా చేస్తే వేలాది డాలర్ల చందాలు తీసుకున్న ఆమె తగినంతగా పేదలకు, అనాథలకు, అంతిమ ఘడియల్లో వున్న వారికి చేసిందేమీ లేదని పెదవి విరిచాడు!
మార్కండేయ కట్జూ మదర్ పై చేసిన వ్యాఖ్యల్ని మనం సమర్థించకపోవచ్చు. లేదా పూర్తిగా ఒప్పుకోకపోవచ్చు. కాని, థెరిసా లాంటి ఒక త్యాగమూర్తిని టార్గెట్ చేస్తే మనసు చివుక్కుమంటుంది. కాని, ఆ కారణం చేత మదర్ థెరిసాను ఎవ్వరూ విమర్శించవద్దు, ప్రశ్నించవద్దు అంటే కూడా సబబు కాదు. ఆమెని మనసారా అభిమానించి ఫాలో అయ్యే వారు ఇది అర్థం చేసుకోవాలి. మదర్ థెరిసా ఎంత గొప్పో... సంస్కారవంతమైన భాష, భావం వాడినంత వరకూ... భావ ప్రకటనా స్వాతంత్ర్యం కూడా అంతే గొప్పా!






