తల్లి ప్రేమతో తెలివితేటలు పెరుగుతాయా!

 

తల్లి ప్రేమకి హద్దులు ఉండవు. పోలికలూ దొరకవు. మరి ఆ ప్రభావం ఊరికనే పోతుందా! తల్లి ప్రేమతో మెదడే మారిపోతుందని కొన్ని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తల్లి ప్రేమని పొందే విద్యార్థులు మిగతావారితో పోలిస్తే చదువులో చురుగ్గా ఉంటారనీ, పరిపక్వతతో వ్యవహరిస్తారనీ తెలుస్తోంది. తల్లి అనురాగాన్ని పొందే పిల్లల మెదడులో కూడా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని కూడా కొందరు పరిశోధకులు నిరూపించారు.

 

పిల్లల మెదడు మీద తల్లి ప్రభావాన్ని తేల్చేందుకు పరిశోధకులు ఓ 92 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 3 నుంచి 6 ఏళ్ల వయసులోపువారే! ప్రయోగంలో భాగంగా పిల్లవాడిని తల్లితో పాటు ఐదు నిమిషాల పాటు ఒక గదిలో ఉంచారు. ఆ సమయంలో ఏదో ఫారం పూర్తిచేయమని తల్లికి చెప్పారు. పిల్లవాడి కళ్ల ముందర ఓ ఆకర్షణీయమైన కాగితంలో చుట్టిన బహుమతిని ఉంచారు. తల్లి ఫారంని పూర్తిచేసేవారకూ కూడా పిల్లవాడు ఆ కాగితంలో తన కోసం ఏ బహుమతి ఉందో చూడ్డానికి లేదంటూ షరతు విధించారు.

 

సహజంగానే పిల్లవాడు తన ముందున్న ప్యాకెట్లో ఉన్న బహుమతిని తీసి చూడాలన్న తపనతో ఉంటాడు. ఆ సమయంలో తల్లి ఒక పక్క ఫారంని పూర్తిచేస్తూనే తన కొడుకుని ఏ విధంగా సముదాయించాల్సి వచ్చేది. ఈ సమయంలో వారిని గమనించేందుకు కొందరు సైకాలజిస్టులను నియమించారు. పిల్లవాడితో తల్లి ఎంత ప్రేమగా వ్యవహరిస్తోందో చూసి, దాని బట్టి వారిరువురి మధ్య బంధాన్ని అంచనా వేశారు.

 

ఓ నాలుగేళ్లు గడచిన తర్వాత ఆనాటి పిల్లలను మళ్లీ ల్యాబ్కు తీసుకువచ్చారు పరిశోధకులు. అక్కడ MRI స్కానింగ్ ద్వారా వారి మెదడులో వచ్చిన మార్పుని అంచనా వేశారు. ప్రేమగా చేసుకునే తల్లులు ఉన్న పిల్లల్లోని హిప్పోకేంపస్ అనే భాగంలో అనూహ్యమైన ఎదుగుదల వచ్చినట్లు గమనించారు. తల్లి అంత ప్రేమగా వ్యవహరించని పిల్లలకంటే వీరి హిప్పోకేంపస్ ఏకంగా పదిశాతం ఎక్కువగా ఎదిగింది. తల్లిప్రేమ పొందిన పిల్లలలో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉన్నట్లు ఈ ప్రయోగంలో తేలింది.

 

మనలో నేర్పు, జ్ఞాపకశక్తి, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి లక్షణాలన్నింటినీ హిప్పోకేంపస్ నియంత్రించగలదు. ఈ హిప్పోకేంపస్ బాగుంటే మనిషి అద్భుతాలు సాధించేందుకు సిద్ధంగా ఉంటాడన్న మాట! మరి ఆ అద్భుతాల వెనుక తల్లి ప్రేమ దాగుందన్న విషయం తేలిపోయిందిగా!

- నిర్జర.