చంద్రుడి మీదే అడుగుపెట్టాం... ఇక జీవితం ఒక లెక్కా!

 

1969 జులై 21. అప్పటివరకూ మనిషి సాగించిన ప్రగతి ఒక ఎత్తు. ఆనాడు జరిగిన అద్భుతం ఒక ఎత్తు. అవును. ఆ రోజు మనిషి చంద్రుని జయించాడు. అమెరికాకు చెందిన నీల్ ఆర్మస్ట్రాంగ్ ఆ రోజు మనిషి మీద తొలి అడుగు మోపాడు. అపోలో 11 అనే వ్యోమనౌక ద్వారా చంద్రుని మీదకు చేరుకున్న ఆర్మస్ట్రాంగ్ అక్కడ రెండున్నర గంటలు గడిపాడు.

 

అంతరిక్షంలోకి వెళ్లాలన్న మనిషి కోరిక ఈనాటిది కాదు. అతని ఊహ తెలిసినప్పటి నుంచీ మనిషి దృష్టి ఆకాశం వైపే ఉండేది. అక్కడి నక్షత్రాలని గమనిస్తూ, సూర్యోదయాన్ని చూస్తూ అతను కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు. భూమి మీద నాగరికత ఏర్పరుచుకున్న మనిషి, నిదానంగా ఆకాశాన్ని కూడా జయించాలని అనుకున్నాడు. 1957లో రష్యా స్పుత్నిక్ పేరుతో అంతరిక్షంలోకి మొట్టమొదటి ఉపగ్రహాన్ని పంపింది. ఇక అప్పటి నుంచి చంద్రుడి మీదకు ఎప్పుడెప్పుడు చేరుకోవాలా అన్న ఆలోచన మొదలైంది. ఒక రకంగా రష్యా, అమెరికాల మధ్య ఉన్న కోల్డ్ వార్ కూడా, ఎవరు త్వరగా చంద్రుని మీదకు చేరుకుంటారా అన్న పోటీకి కారణం అయ్యింది.

 

నిజంగా చంద్రుడు చేరుకోగలడా! చేరకుని అక్కడ కాలు మోపగలడా! కాలు మోపాక బతికి బట్టకట్టగలడా! లాంటి సవాలక్ష ప్రశ్నలు మనల్ని వేధించాయి. మనిషి కనుక చంద్రుని చేరుకుంటే మహాప్రళయం జరుగుతుందన్న శాపాలూ వినిపించాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి చేరుకోవాలన్న తపనతో 1967లో అపోలో 1 ను అట్టహాసంగా బయల్దేరదీశారు. కానీ ఏం పొరపాటు జరిగిందో ఏమో... ఆ వ్యోమనౌక నేల మీదే కాలిపోయింది. అందులో ఉన్న ముగ్గురు వ్యోమగాములూ కాలిబూడిదైపోయారు.

అపోలో 1 వైఫల్యం తర్వాత  చంద్రుడి మీదకి వెళ్లడం అసాధ్యం అన్న వాదనలకు బలం పెరిగిపోయింది. కానీ మనిషి ఊరుకోలేదు. మళ్లీ చనిపోయే ప్రమాదం ఉందని తెలిసినా వెనకడుగు వేయలేదు. నీల్ ఆర్మస్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కోలిన్స్ అనే ముగ్గురు వ్యోమగాములు చంద్రుని మీదకి కాలు దువ్వేందుకు బయల్దేరారు. నిజానికి అపోలో 11 బయల్దేరే సమయంలో కూడా ఒక పొరపాటు జరిగింది. దాంతో అపోలో 11 కూడా ఆకాశంలో భస్మం అయిపోవడం ఖాయమనీ, ఒకవేళ చంద్రుని మీదకు వెళ్లినా తిరిగి భూమి మీదకు చేరుకోలేదని అంతా భయపడ్డారు. కానీ ఈసారి అదృష్టం మనిషి పట్టుదలకు తలవంచింది. వ్యోమగాములు క్షేమంగా వెళ్లి విజయంతో తిరిగి వచ్చారు. ఆ విజయాన్ని నమ్మడానికి చాలామందికి చాలాకాలమే పట్టింది. కొందరు ఇప్పటికీ మనిషి చంద్రుడి మీదకు చేరుకోలేదనీ, అవన్నీ సినిమా సెట్టింగులనీ వాదించేవారూ ఉన్నారు. నమ్మకం ఎంత బలమైనదో, అనుమానమూ అంతే బలమైనది కదా!

 

ఏదేమైనా, చాలామంది దృష్టిలో చంద్రుడి మీద మనిషి కాలు మోపిన క్షణం ఓ మైలురాయి మాత్రమే కాదు... మనిషి తల్చుకుంటే ఏదైనా సాధించగలదన్న నమ్మకానికి రుజువు. అందుకే నీల్ ఆర్మస్ట్రాంగ్ సైతం ‘ఇది నాకు చిన్న అడుగే కావచ్చు. కానీ మానవాళికి గొప్ప విజయం,’ అన్నాడు. ఇప్పటికీ ఎవరన్నా నిరాశలో ఉన్నప్పుడు- ‘చంద్రుడి మీదకే అడుగుపెట్టాం, ఈ సమస్య ఒక లెక్కా!’ అన్న సమాధానం కొత్త స్ఫూర్తిని అందిస్తుంది.

- నిర్జర.