రాజస్థాన్ బరిలో అజారుద్దీన్

 

 

 

మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్‌ ఈసారి రాజస్థాన్‌ రాష్ట్రంలోని సవాయ్‌ మదోపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు. ఇంతకుముందు ఆయన ప్రాతినిధ్యం వహించిన యూపీలోని మొరాదాబాద్ నుంచి ఫీల్డింగ్ ప్లేస్ మార్చినట్లుగా ఏకంగా రాజస్థాన్ పంపేశారు. 58 మంది పేర్లతో కాంగ్రెస్ పార్టీ లోక్ సభకు పోటీచేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అందులో అజహరుద్దీన్ పేరు రాజస్థాన్ లో వినపడింది. మొరాదాబాద్ లో ఆయనపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతవల్లే రాజస్థాన్‌ కి మార్చినట్టు సమాచారం.ఇక కేంద్ర మంత్రులు కపిల్‌ సిబల్‌ ను ఢిల్లీలోని చాందినీచౌక్ స్థానం నుంచి, కృష్ణతీరథ్‌ను వాయవ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు.


వారణాసి నుంచి నరేంద్రమోడీ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి హస్తం తరఫున ఎవరు బరిలో దిగుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో మంగళవారం విడుదల చేసిన మూడో జాబితాలో వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ జాబితాలోనూ వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేయలేదు.