TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోడీ

Published on: Mon Nov 18, 2024 9:07AM

 

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెజిల్‌లో అడుగుపెట్టారు. రాజధాని నగరం రియో డిజెనీరో చేరుకున్న ఆయనకు అక్కడి భారత రాయబారి సురేష్ రెడ్డి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం ఘన స్వాగతం పలికింది.  బ్రెజిల్ వేదికగా సోమ, మంగళ (నవంబర్ 18, 19) వారాలలో  రెండు రోజుల పాటు జరిగే  19వ జీ20 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా సభ్య దేశాల నాయకులతో మోడీ కీలక చర్చలు జరపనున్నారు. కీలకమైన ఈ సదస్సులో ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాల నాయకులు పాల్గొంటారు

తాను బ్రెజిల్ చేరుకున్న విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డిజెనీరో నగరంలో అడుగు పెట్టానననీ, ఈ సదస్సులో సభ్యదేశాల నేతలతో  ఫలవంతమైన చర్చలు జరిపేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాననీ పేర్కొన్నారు. తనకు విమానాశ్రయంలో  లభించిన స్వాగతానికి సంబంధించిన ఫొటోలను ఆయన తన పోస్టుతో పాటు షేర్ చేశారు.

 మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా సందర్శన అనంతరం ప్రధాని మోడీ బ్రెజిల్ చేరుకున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో  ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడ ప్రవాస భారతీయ సమూహంతో కూడా ఆయన మాట్లాడారు. కాగా బ్రెజిల్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ గయానాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి.