మోడీ శకంలో తొలి కుంభకోణ రహిత సంవత్సరం

 

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నిన్న గుజరాత్ లోని మధుర పట్టణంలో ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో దేశ ప్రజలకు మంచి రోజులు వచ్చేయని కానీ గత 60 ఏళ్ళుగా దేశాన్ని దోచుకు తిన్న వాళ్ళకి చెడ్డ రోజులు మొదలయ్యాయని అన్నారు. గత పదేళ్ళుగా దేశంలో జరిగిన అనేక కుంభకోణాల గురించి వార్తలు వినబడేవని కానీ ఈ ఏడాది కాలంలో ఎటువంటి కుంభకోణాలు జరుగలేదని అదే తమ పారదర్శకమయిన పాలనకు నిదర్శనమని అన్నారు.

 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిల్లీలో పాతుకుపోయిన శక్తివంతమయిన అవినీతి కేంద్రాలను ఏరి పారేశామని తెలిపారు. తాను ఈ దేశానికి ప్రధాన సేవకుడిని, ప్రధాన ధర్మ కర్తనని మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఖజానాలో జమా చేసామని తెలిపారు. ఇదివరకు కేంద్రప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే అందులో కేవలం 15పైసలు మాత్రమే పేదప్రజలకు చేరేదని స్వయంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అన్నారని కానీ తమ ప్రభుత్వం నూటికి నూరు పైసలు కూడా పేద వాడికే అందేలా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

 

ప్రధాని మోడీ చెప్పిన మాటలు నూటికి నూరు శాతం వాస్తవమేనని ప్రజలు కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ప్రతీ నెలకీ రెండు నెలలకీ ఓమారు ఓ భారీ కుంభకోణం బయటపడుతుండేది. వాటిని కనిపెట్టి దోషులను కోర్టు ముందు ఉంచవలసిన సీబీఐ మాజీ డైరక్టర్ రంజిత్ సిన్హా కాంగ్రెస్ సేవలో తరించిపోవడం, అందుకు సుప్రీంకోర్టు ఆయనకు మొట్టికాయలు వేయడం అందరికీ తెలిసిందే. విమానాలు, హెలికాఫ్టర్లు కాంట్రాక్టులు సంపాదించుకొనేందుకు, డిల్లీలో కొంతమంది పెద్ద తలకాయలకు ముడుపులు చెల్లించామని విదేశీ సంస్థలు గొప్పగా చెప్పుకొన్నాయంటే డిల్లీలో అవినీతి ఎంతగా మేటలు వేసిందో అర్ధమవుతుంది.

 

అటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకలించడం కష్టమే. కానీ వాటిపై మోడీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపినందునే అవిప్పుడు కనబడకుండా పోయాయి. అందుకే మోడీ ఏడాది పరిపాలనలో ఇంతవరకు ఒక్క కుంభకోణం కూడా జరగకుండా నిలువరించగలిగారు. మోడీ అధికారం చేప్పట్టిన ఏడాది కాలంలోనే ప్రపంచ దేశాలలో భారత్ కు ఒక ప్రత్యేక గుర్తింపును తేగలిగారు. అందుకు ఆయన ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్ధిక, పారిశ్రామిక, విదేశీ విధానాలే కారణమని చెప్పవచ్చును. చాలా వేగంగా తనదయిన శైలిలో దూసుకుపోతున్న మోడీ ప్రభుత్వ పని తీరు వలన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్, దానితో బాటు రాహుల్ గాంధీ భవిష్యత్ కూడా చాలా అగమ్యగోచరంగా, ప్రశ్నార్ధకంగా మారుతోంది. అందుకే తీవ్ర అభద్రతా భావంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోడీ ధరించిన సూటు గురించి, ఆయన చేస్తున్న విదేశీ పర్యటనల గురించి మాట్లాడుతూ సామాన్య ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించేందుకు చవకబారు ప్రయత్నాలు చేస్తోంది. కానీ దేశ ప్రజల నమ్మాకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్ పార్టీ మాటలను ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరు.

 

దేశాభివృద్ధి జరిగేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ తప్పు పట్టలేరు. కానీ భూసేకరణ చట్టానికి చేసిన సవరణల విషయంలో కాంగ్రెస్ వేస్తున్న ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సరయిన సమాధానం చెప్పలేకపోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశః పారిశ్రామికీకరణ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతోనే భూసేకరణ చట్టానికి సవరణలు చేసి ఉండవచ్చును. కానీ నేటికీ దేశంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు కనుక వ్యవసాయ అభివృద్ధికి కూడా మోడీ ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఇచ్చి ఉండవలసిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

 

గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే మోడీ పాలన చాలా సమర్ధంగా, వేగంగా, పారదర్శకంగా సాగుతోందని ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. కానీ అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి లభించి, వారి జీవన ప్రమాణాలు మెరుగవడమే ఎవరి పాలనకయినా గీటురాయిగా నిలుస్తుంది. మోడీ ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న చర్యల వలన సత్ఫలితాలు మున్ముందు విస్పష్టంగా కనబడే అవకాశం ఉంది.