మోడీకి అమెరికా అనుమతి నిరకరాణ దేనికి సంకేతం?

 

సాధారణంగా ప్రపంచాదేశాలన్నిటి మీదా ఒక కన్నేసి ఉంచే అమెరికా, అభివృద్ధి పదంలో దూసుకు పోతున్న భారత్ వంటి దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించదనుకొంటే పొరపాటే. భారతదేశంలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికపుడు బేరీజు వేసుకొని తదనుగుణంగా వ్యూహాలు అమలుచేసే అమెరికా, వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలిచే అవకాశం లేదని రూడీ చేసుకొన్న తరువాతనే మోడీకి తమ దేశంలో ప్రవేశించేదుకు అనుమతి నిరాకరించిందా? లేకపొతే ఆయన భారతీయ జనతాపార్టీకి నాయకత్వం వహించి ప్రధాని పదవి చేపట్టే అవకాశం లేదని తన గూడచార వర్గాలు నివేదికలు ఇచ్చినందునే దైర్యంగా ఆయనకు అనుమతి నిరాకరించిందా? అనే ప్రశ్నలు తలఎత్తేలా చేస్తోంది.

 

అలా కాని పక్షంలో నరేంద్ర మోడీకి అనుమతి నిరాకరించడం ద్వారా అమెరికా రాజకీయంగా చాలా పెద్ద తప్పే చేసినట్లవుతుంది. ఇప్పుడు బీజేపీ నేత అయిన నరేంద్ర మోడీకి అనుమతి నిరాకరించిన అమెరికా ప్రభుత్వం, రేపు ఎన్నికల తరువాత ఒకవేళ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడితే, మళ్ళీ అప్పుడు అదే బీజేపీ ప్రభుత్వంతో అమెరికా తన సంబందాలను కొనసాగించవలసి ఉంటుంది. ఒకవేళ నరేంద్ర మోడి ప్రధాన మంత్రి పదవికి అవకాశం దక్కక ఏ విదేశాంగ శాఖో లేక రక్షణ శాఖకో కేంద్రమంత్రిగా బాద్యతలు స్వీకరించినా అమెరికాకు ఆయనతో చేదు అనుభవాలు ఎదుర్కొనక తప్పదు.

 

మోడీకి అమెరికా తన దేశంలో అడుగుపెట్టడానికి అనుమతి నీయకపోవడం ద్వారా తన అసమ్మతిని తెలియజేయడం బాగానే ఉన్నపటికీ, ఒకవేళ ఆయన ఈ రోజు కాకపోయినా రేపయినా భారత దేశ ప్రధాని పదవిని అధిష్టిస్తే అప్పుడు అమెరికా ఆయనను అవమానించినందుకు క్షమాపణలు కోరుతుందా లేక ఆయన విషయంలో అదే ధోరణి కొనసాగిస్తుందా? అనే ప్రశ్నలకు జవాబులు కాలమే చెపుతుంది.