TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆగస్టు 6న జాగృతి జంబో కమిటీలు : ఎమ్మెల్సీ కవిత

Published on: Sat Jul 26, 2025 4:55PM

 

తెలంగాణ  జాగృతి సంస్థను రాజకీయంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆగస్టు 6న ప్రొ.జయశంకర్  జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన 'లీడర్' శిక్షణా తరగతులకు హాజరైన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతిజిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు. 

ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు. మన సంప్రదాయాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించుకోవడమే నాయకుడు లక్షణమని తెలిపారు.‘‘ఎప్పుడూ కొత్తగా ఉంటేనే  సంస్థలు బతుకుతాయి. తల్లి గర్భంలో నుంచి ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడవుతాడు తప్ప.. మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాలేడని ఆమె అన్నారు. సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 11 స్థానంలో ఉందని ఓ సర్వేలో తేలింది.

 తోటివారి గోప్యతకు, మర్యాదకు భంగం వాటిల్లకుండా పదునైన విమర్శలు చేయడం నేర్చుకోండి. పక్కవాడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థం. మహాత్మాగాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో లేరు. కానీ, ఇప్పటికీ ఆయన్ని గుర్తు చేసుకుంటాం. తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరీకి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతీ మనుగడ సాధించలేదు. సాంస్కృతిక నేపథ్యం లేని జాతి.. పునాది లేకుండా కట్టిన బిల్డింగ్‌ లాంటిది. 

తెలంగాణ జాతికి అద్భుతమైన నేపథ్యం ఉంది. దానిని పరిరక్షించేందుకే  ‘జాగృతి’ పని చేస్తుంది. నాడు పోలవరం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుపడ్డాం, నేడు బనకచర్ల లింక్ ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోబోమని కచ్చితంగా ఆపి తీరుతామన్నారు. తెలంగాణ వనరులు, సాంస్కృతి పరిరక్షించడమే ఆలోచనగా జాగృతి పనిచేస్తుందని కవిత వెల్లడించారు.