15 రోజుల తర్వాత భూములు తీసుకుంటాం.. నారాయణ

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం భూసేకరణపై ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది ప్రభుత్వం జారీ చేసిన జీవో పై హైకోర్టును ఆశ్రయించగా దానిపై స్టే విధించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించి భూసేకరణపై హైకోర్టు స్టే ఇవ్వలేదని దీనిని కొంతమంది వక్రీకరిస్తున్నారని అన్నారు. భూసేకరణపై విచారణ జరిగిందని మరో 15 రోజుల తర్వాత భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మే నెలఖారులోగా 20 వేల ఎకరాల భూమిని తీసకుంటామని, జూన్ లో మరో 20 నుండి 25 వేల ఎకరాల భూమిని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ కొన్న భూములకు రూ. 65 వేల కోట్లు వరకూ పరిహారం చెల్లించామని మంత్రి నారాయణ తెలిపారు.