వైజాగ్ కాంగ్రెస్ లో సిగపట్లు

 

ఇంకా ఎన్నికలకి ఏడాది సమయం ఉండగానే, వైజాగ్ లో కాంగ్రెస్ నేతలందరూ ఎవరి ప్రయత్నాలలో వారు బిజీ అయిపోయారు. కొందరు తమకే టికెట్ ఇప్పించవలసిందిగా పార్టీ పెద్దల దగ్గర పైరవీలు చేసుకొంటుంటే, మరికొందరు తమకు పోటీగా ఉన్న వారిని రంగంలోంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నారు.

 

ఈ విషయంలో అందరి కంటే ముందుగా రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామి రెడ్డి రంగంలోకి దిగి అటు డిల్లీలోను, ఇటు నగరంలోనూ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల నగరంలో అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంబించారు.

 

ఇక కాంగ్రెస్ పార్టీలో ముటాలు కట్టుకోవడానికి పెద్ద కారణాలేవీ అక్కరలేదనే సంగతి అందరికీ తెలిసిందే. మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి, అనకాపల్లి ప్రాంతాలను విశాఖలో విలీనం చేద్దామనే ప్రతిపాదన చేయగా దానిని సుబ్బిరామి రెడ్డి సమర్దించారు. కానీ, పురందేశ్వరి మరియు విశాఖ దక్షిణ శాసన సభ్యుడు మరియు నగరంపార్టీ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమస్యను పరిష్కరించేదుకు శాసనసభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీ విలీన ప్రతిపాదనను నిర్ద్వందంగా ఖండించడంతో దానిని సమర్దిస్తున్న వారిరువురి అహం దెబ్బతింది.

 

అటువంటి సమయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ రాష్ట్రంలో జిల్లా, నగర, మండల స్థాయి వరకు పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తుండటంతో ఇదే అదునుగా గంటా శ్రీనివాసరావు ‘ఒక వ్యక్తికి ఒక పదవి’ అనే రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ఫార్ములాను తెలివిగా ఉపయోగించుకొని, తనను వ్యతిరేకిస్తున్న తైనాలను ఆ పదవిలోంచి తప్పించి తన అనుచరుడు బెహరా భాస్కర్ రావుని నియమించుకొన్నారు. అందుకు సుబ్బిరామిరెడ్డి కూడా ఓ చెయ్యేసి తోడ్పడారని సమాచారం.

 

తద్వారా మంత్రి గంటా తనను వ్యతిరేకించినందుకు తైనాల పదవికి కత్తెరవేసి తన తడాఖా చూపించానని సంతోషిస్తే, తద్వారా పురందేశ్వరికి తన తడాఖా చూపానని సుబ్బిరామిరెడ్డి కూడా సంతోషిస్తున్నారు. పనిలో పనిగా ఆమెను కూడా మెల్లగా పోటీలోంచి తప్పించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, గతంలో కార్పొరేటర్ గా ఉన్న తన అనుచరుడు భాస్కర్ రావుని ముందుకు తేవడం ద్వారా రాబోయే ఎన్నికలలో తనను వ్యతిరేకిస్తున్నమరో విశాఖ శాసనసభ్యుడిని కూడా రేసులోంచి తప్పించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

 

ఈ సిగపట్లు ఎన్నికలు దగ్గిరపడుతున్న కొద్దీ ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. ఇటువంటి రాజకీయాలను చూస్తుంటే రాహుల్ గాంధీ వల్లె వేస్తున్న నీతి సూత్రాలని కాంగ్రెస్ పార్టీలో అమలు చేయడం ఎన్నటికయినా సాధ్యమేనా అనే ప్రశ్న ప్రజలకి ఉదయించక మానదు.