జగన్ కి పిచ్చి పట్టి సందులు, గొందుల్లో తిరుగుతున్నారు

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే.బ్యారేజ్ పై కవాతు నిర్వహించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.సాగు, తాగునీరు అందించే బ్యారేజీలపై కవాతులు, బల ప్రదర్శనలు మానుకోవాలని జనసేన పార్టీకి సూచించారు. ప్రచారాలను జాతీయ రహదారులపై పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని విమర్శిస్తున్న పార్టీలు క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్‌ పాదయాత్రలో ఉన్నా.. ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు కేంద్రం నుంచి రూ.27వేల కోట్లకు పైగా పరిహారం రావాల్సి ఉందని.. కేంద్రం ఆ సొమ్మును విడుదల చేస్తే తాము నిర్వాసితులకు ఇచ్చేస్తామని వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు ఖర్చును, నిర్మాణం జరుగుతున్న తీరును ఆన్‌లైన్‌లో పెడుతున్నామని ప్రపంచంలో ఎవరైనా ఆ లెక్కలు చూసుకోవచ్చని తెలిపారు.పోలవరం ప్రాజెక్టును ఇప్పటివరకు 1 లక్షా 47 వేల మంది పోలవరం ప్రాజెక్టును సందర్శించారని.. ప్రతిపక్ష నేత జగన్‌ ఒక్కసారి కూడా చూడకపోవటం శోచనీయమని మంత్రి అన్నారు. పాదయాత్రలో 108 వాహనాలపై జగన్‌ ఆడిన డ్రామాను ప్రజలంతా చూశారని.. ముఖ్యమంత్రి పదవి పిచ్చిపట్టి జగన్‌ సందులు, గొందుల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. 2019లో జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. 57 ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో ఇప్పటికే 15 ప్రాజెక్టులను ప్రారంభించామని.. మరో 16 కొత్త ప్రాజెక్టులను సైతం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలిపారు.ఓ భాజపా ఎంపీ దిల్లీలో కూర్చుని తెదేపాపై విమర్శలు చేస్తున్నారని.. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన ఎంపీయో ఎవరికీ తెలియదని జీవీఎల్‌ను ఉద్దేశించి విమర్శించారు.