TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెంకన్న కోసమా? సుబ్బన్న కోసమా?.. మంత్రిగారి తిరుమల యాత్రలు!

Published on: Mon Jun 20, 2022 4:35PM

 నిండు సభలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్ల మీద కూర్చోని దణ్ణం పెట్టి అందరి దృష్ఠిలో పలుచన అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రపీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ..  తిరుమల యాత్రలు వివాదాస్పదంగా మారాయి. చీటికీ మాటికీ తిరుమల యాత్రలో తరిస్తున్న ఆయన  రెండు నెలల్లో 20 సార్లు తిరుమలేశుని సన్నిధికి వెళ్లారు. అయితే ఆయన తిరుమల యాత్ర  టీటీడీ సిబ్బందికి ఓకింత ఇబ్బందికరంగా మరిందని అంటున్నారు. స్వామి వారి దర్శనం కోసం మంత్రిగారు వస్తే.. వెంట పెట్టుకొని మరీ స్వామిలోరి దర్శనం చేయించి.. బయటకు సాగనంపేవరకు టీటీడీ సిబ్బంది కనీస బాధ్యత అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ  మంత్రి చెల్లుబోయిన ఇలా చీటికీ మాటికీ తిరుమల వచ్చేస్తుంటే.. సిబ్బందికి ఇబ్బంది అవుతోందట.

దీంతో చెల్లుబోయిన తిరుమల వస్తే ప్రొటోకాల్ కు తిలోదకాలిచ్చేసి మంత్రిగారిని  స్వామి వారి దర్శనానికి తీసుకువెళ్లేందుకు క్లాస్ ఫోర్ సిబ్బందిని పురమాయించి చేతులు దులుపుకుంటున్నారట. టీటీడీ సిబ్బందులు ఇలా ఉంటే.. మంత్రికి తమ కష్టాలు విన్నవించుకునేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలకు   వెలగపూడి సచివాలయంలో ఆయన దర్శనం దొరకడం దుర్లబమైపోయి ఇబ్బందులు పడుతున్నారట.

ఎప్పుడు సెక్రటేరియెట్ కు వచ్చినా ఆయన తిరుమల యాత్రలో ఉన్నారన్న సమాచారమే అందుతోంది. దీంతో నియోజవకర్గంలోనే కాదు, సచివాలయంలోనూ, టీటీడీ సిబ్బందిలోనూ కూడా చెల్లుబోయినపై ఓ రేంజ్ లో సెటైర్లు షికార్లు చేస్తున్నాయని మంత్రి వ్యక్తిగత సిబ్బందే చెబుతున్నారు. చెల్లుబోయిన తిరుమల యాత్రలు వెంకన్న కోసమా లేక సుబ్బన్న కోసమా అంటూ ఆయనపై జోకులు పేలుతున్నాయి.

సమాచార, బీసీ సంక్షేమ శాఖలు కేబినెట్ లో ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అంతటి కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రి నిత్యం తిరుమల యాత్రలతో ఎవరికీ అందుబాటులో లేకుండా బీజీ అయిపోవడం ఏం సమంజసం అంటూ ఆయా శాఖల అధికారులు సైతం గుసగులసాడుకుంటున్నారు.