కార్యకర్తలకే ఈ విజయం అంకితం.. రేవంత్
posted on: Feb 14, 2026 9:43AM
.webp)
పురపోరులో అద్భుత విజయం సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పుగా పురపోరులో కాంగ్రెస్ విజయాన్ని ఆయన అభివర్ణించారు. ప్రజలు ఆదరించి, దీవించిన ఫలితమే ఈ విజయమన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఇంతటి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
ఈ విజయంపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విజయం లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమకు దక్కిన ఫలితంగా అభివర్ణించారు. అందుకే ఈ విజయాన్ని వారికే అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, పారదర్శక పాలనకు పునరంకితం అవుతున్నామనీ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని, ప్రతి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామని రేవంత్ పునరుద్ఘాటించారు.



.webp)


