అవతలి వ్యక్తి జబ్బుని కూడా మెదడు పసిగట్టేస్తుంది!

 

మనిషి మెదడుకి ఉన్న సామర్థ్యం గురించి కొత్తగా చెప్పేదేముంది. సూపర్ కంప్యూటర్లని సైతం దాటేసే మెదడు శక్తి గురించి కొత్తగా వినేదేముంది. కానీ ఇన్ని విన్నా ఇంకా మెదడు గురించి ఏదో సరికొత్త విషయంతో ముందుకొస్తున్నారు పరిశోధకులు.

 

తాజాగా వెలువడిన ఓ పరిశోధన ప్రకారం మన చుట్టూ ఉండేవారిలోని అనారోగ్యాన్ని మన మెదడు ఇట్టే పసిగట్టేస్తుందట. అలా అనారోగ్యం బారిన పడ్డవారి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండమన్న హెచ్చరికలు జారీ చేస్తుందట. ఈ విషయంలో నిజానిజాలు తేల్చుకునేందుకు స్వీడన్కు చెందిన పరిశోధకులు ఓ ప్రయోగం చేశారు. ఇందులో భాగంగా కొందరికి, అంతగా హాని కలిగించని బ్యాక్టీరియాను ఎక్కించారు. ఆ బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు సహజంగానే వారిలోని రోగనిరోధకశక్తి విజృంభించింది. ఒంట్లోకి చేరుకున్న బ్యాక్టీరియాను తరిమికొట్టే సమయంలో జలుబు, జ్వరం, నిస్సత్తువ లాంటి లక్షణాలు బయటపడ్డాయి.

 

ఇలా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులని ఫొటోలు, వీడియోలు తీశారు. వారి వాసనలనీ ఒడిసిపట్టారు. వాటన్నింటినీ కొందరు సాధారణ వ్యక్తులకు చూపించి... వీరిలో ఎవర్ని చూస్తే మీకు దూరంగా ఉండాలనిపిస్తోంది అని అడిగారు. వందలాది ఫొటోల నుంచి వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తలు ఫొటోలను చూపించి- ‘వీరికి దూరంగా ఉండాలనిపిస్తోంది,’ అని జనం చెప్పారట. వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తుల తాలూకు వాసనని చూపించినప్పుడు కూడా ఇతరుల మెదడు చురుగ్గా ప్రతిస్పందించడాన్ని గమనించారు. మనకి దగ్గరగా ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు ఉంటే వారిని మరింత జాగ్రత్తగా కాపాడుకునేందుకు, అపరిచితుల దగ్గర ఇలాంటి లక్షణాలు ఉంటే వారి నుంచి దూరంగా ఉండేందుకు మెదడు సమాయత్తమవుతోందన్నమాట!

 

శరీరమంటే మనకి కేవలం పైకి కనిపించేది మాత్రమే కాదు! ఆ శరీరం సక్రమంగా పనిచేసేందుకు, రోగాల నుంచి తప్పించుకునేందుకు లోలోపల అసమానమైన యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. ఈ పరిశోధన అదే విషయాన్ని మరోసారి నిరూపించింది.

- నిర్జర.