మైండ్ క్లీన్‌గా ఉంచుకుందాం

 

మన ఇల్లు క్లీన్‌గా లేకపోతే చిరాకుగా వుండటం మాత్రమే కాదు.. అనారోగ్యం కూడా కలుగుతుంది. మన మైండ్ కూడా ఇల్లు లాంటిదే. దాన్ని క్లీన్‌గా వుంచుకోకపోతే చిరాకులు, ఆవేశాలు, ఆగ్రహాలు కలగడం మాత్రమే కాదు... అనారోగ్యం కూడా కలుగుతుంది. కోపం, ఆవేశం, వేదన, అసహనం, అసూయ, స్వార్థం... ఇలా వీటన్నిటితో నిండిపోయిన మెదడుకి సృజనాత్మక ఆలోచనలు రావడం కష్టమే. జీవితం అందంగా వుండాలంటే సృజన ప్రతి పనిలో కనిపించాల్సిందే. కాబట్టి మనం తక్షణం ఏమాత్రం సంతోషాన్నివ్వని ఆలోచనలు మెదడులోంచి వదిలించుకుని, ఆ స్థానాన్ని మంచి ఆలోచనలతో నింపెయ్యాలి. మన మస్తిష్కంలో చోటు చేసుకున్న ఓ కొత్త మంచి ఆలోచన మన కొత్త జీవితానికి, జీవిత అభ్యున్నతికి నాంది కావచ్చు. మన మస్తిష్కం లాంటిదే మన ఇల్లు కూడా. నిజానికి ఒత్తిడికి మూల కారణాల్లో ఒక పద్ధతిగా వుండని ఇంటి పరిసరాలు కూడా ఒకటి. అవసరానికి కనిపించని వస్తువు, సమయాన్ని మింగేసే వెతుకులాట ఒత్తిడిని పెంచితే - అవసరం వున్నా లేకపోయినా ఇంటినిండా గజిబిజిగా వుండే సామాను మన మనసునీ, జీవన విధానాన్నీ చికాకు పరుస్తాయి. అందువల్ల ఇంట్లో అనవసరంగా వున్నవాటిని వదిలించుకుంటే మన ఇల్లు చక్కని పొదరిల్లులా అందంగా వుంటుంది... ఆనందాన్ని అందిస్తుంది. మన జీవన విధానం ఎంత సింపుల్‌గా వుంటే జీవితం అంత ఆనందంగా గడపచ్చు. అప్పుడప్పుడు మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మనకి ఏది నచ్చుతుందో గుర్తించాలి. మన ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే అవసరంలేని వాటిని విడిచి పెడుతూ, కావల్సినవాటిని చేర్చుకుంటూ, జీవితాన్ని ప్రేమిస్తూ, అందంగా, చూడముచ్చటగా తీర్చిదిద్దుకుంటే మనం కూడా లేటెస్ట్‌గా వుంటాం. నిత్యనూతనంగా వెలిగిపోతాం.

 

-రమ ఇరగవరపు