తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత

 

మజ్లీస్ పార్టీకి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా మజ్లీస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ నియమితులయ్యారు. శాసనసభ కార్యదర్శి, అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. అధికారులతో చర్చించి ప్రొటెం స్పీకర్‌ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో చార్మినార్‌ నియోజకవర్గం నుంచి అహ్మద్‌ఖాన్‌ గెలుపొందారు. 1994 నుంచి వరుసగా ఐదుసార్లు యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మజ్లీస్‌ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు. 

మరోవైపు ఈ నెల 17న కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. జనవరి 17 నుంచి 20 వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 16న అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 17న ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ఉదయం 11.30గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అదే రోజు స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటించి, నామినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జనవరి 18న స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకోనున్నారు. జనవరి 19న కొత్త శాసనసభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు.