త్వరలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయా?

 

రాష్ట్ర విభజన సమస్య పై తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న ఈ సమయంలో మధ్యంతర ఎన్నికల గురించి ఆలోచన అసంబద్ధంగా అనిపించవచ్చును. గానీ, ప్రస్తుత పరిణామాలను బట్టి కేంద్రం ఈ సంవత్సరం జూన్ నెల లోపుగానే మధ్యంతర ఎన్నికలకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.

 

ఈ నెల 28వ తేదీతో తెలంగాణా అంశంపై కేంద్రం తాడో పేడో తేల్చక తప్పదు. ఇప్పటివరకూ అందుతున్న సంకేతాలను బట్టి కేంద్రం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతున్నట్లు అర్ధమవుతోంది. ఒకవేళ రాష్ట్రాన్ని విభజించడమే జరిగితే, ఆ ప్రయోజనాన్ని కాంగ్రెస్ స్వంతం చేసుకోవాలని ఆలోచించడం సర్వ సాధారణ విషయం. తెలంగాణా ప్రకటించక ముందే తెరాసను తనలో కలిపేసుకోవచ్చును. అదే జరిగితే, వెంటనే ఎన్నికలకి వెళ్లకపోయినట్లయితే మళ్ళీ తెరాస కొత్త పేచీలు మొదలు పెట్టి, ఏవో కుంటి సాకులు చెప్పి కాంగ్రెస్ పార్టీకే హస్తం ఈయక మానదు. అలా జరగకూడదంటే, తెలంగాణా ప్రకటన జరిగిన రెండు, మూడు నెలలలోపే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళాల్సిఉంటుంది.గానీ సాంకేతికంగా ఆ అవకాశం లేదు గనుక మరొక్క రెండు నెలల తరువాతనయిన ఎన్నికలకి వెళ్ళవచ్చును.

 

తెలంగాణా ఇచ్చిన ఆనందంలోనే ప్రజలు కాంగ్రేసుకు ఓటేసే అవకాశం ఉంటుంది కనుక, వీలయినంత తొందరగా ఎన్నికలకి వెళ్ళాల్సిఉంటుంది. తెలంగాణా ప్రకటించినప్పటికీ, తరువాత ఏర్పడే వివాదాల కారణంగా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చిన ఫలితం దక్కకపోగా, రాష్ట్రంలో ఏకాకిగా మారిపోయే ప్రమాదం ఉంది. గనుక, సమస్యలేవీ తలెత్తక మునుపే కాంగ్రెస్ ఎన్నికలకి వెళ్ళక తప్పదు. తెలంగాణాలో అధికారం సంపాదించగలిగితే చాలావరకు సమస్యలను అదుపుచేసే అవకాశం కూడా కాంగ్రెస్ కు ఉంటుంది.

 

ఇక, తెలంగాణా కాక వేరే ఏరకమయిన ఆలోచన చేసినా కూడా తెలంగాణాలో కాంగ్రెస్ మట్టికరవడం ఖాయం. తెలంగాణా ఇచ్చి ఒక చోటయిన గెలిచే అవకాశం ఉంది. గానీ, తెలంగాణా ఈయకపోయినా, సీమాంధ్రాలో కాంగ్రేసుకు గెలిచే అవకాశాలు లేవు.

 

ఒకవైపు జగన్ పార్టీ, మరో వైపు తెలుగుదేశం పార్టీ రెంటికీ కూడా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివి గనుక, ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని గెలవనిస్తాయని అనుకోలేము. కేవలం ప్రముఖ కాంగ్రెస్ నేతలు లగడపాటి, రాయపాటి, కావూరి, బొత్స వంటి పెద్ద తలకాయలు మాత్రమే సీమంధ్రలో గెలిచే అవకాశం ఉంది.

 

ఒకవేళ సీమంద్రాలో కూడా ఎలాగయినా గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తే, ఎన్నికలు ప్రకటించక ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా తనలో కలిపేసుకొనో లేదా జగన్ మోహన్ రెడ్డితో ఎన్నికల ఒప్పందం చేసుకొనో అతనిని జైలు నుండి విడుదల చేసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో గెలిచే అవకాశాలు బాగా మెరుగు పడతాయి.  

 

అలా వీలుకాని పక్షంలో, తెలంగాణా ఇచ్చి ఒకచోటయిన గెలవడమే మంచిదని కాంగ్రెస్ భావించే అవకాశం ఉంది. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ రెంటికీ చెడిన రేవడి అవుతుంది.
 

ఇక, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సబ్సిడీ సిలిండర్లు 6 నుండి 9కి పెంచేందుకు పెట్టిన ముహూర్తం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. జనవరి నుంచే ఇచ్చే అవకాశం ఉన్నపటికీ అది ఏప్రిల్ 1వ తేది ముహూర్తం ఎంచుకోవడం చూస్తే, అది ఆ వెంటనే మధ్యంతర ఎన్నికలు ప్రకటించి ప్రజల ఓట్లు దండుకొనే ప్రయత్నం చేయవచ్చునని పిస్తోంది.

 

ఇది గాక, నగదు బదిలీ పధకాన్ని ఓట్ల వేటలో తన ముఖ్యమయిన అస్త్రమని బహిరంగంగానే ప్రకటించుకొన్న కాంగ్రెస్ పార్టీ, దానిలో ఎన్ని లోటుపాట్లు ఉన్నపటికీ దానిని వెంటనే అమలుచేయడానికి పడుతున్న తొందర చూస్తే, మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్నట్లే కనిపిస్తుంది. మరో ఏడాది తరువాతనో మరెప్పుడో వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ అంత తాపత్రయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తే, కాంగ్రెస్ త్వరలోనే ఎన్నికలకి సిద్ధం అవుతోందని అర్ధం అవుతుంది.

 

ఈ నెల 28వ తేదీన తెలంగాణా ప్రకటన లేదా మరే ప్రకటన చేసిన వెంటనే, రాష్ట్రంలో లేదా రెండు రాష్ట్రాల్లో సమర్దులయిన కొత్త నాయకులని ఎంచుకొని పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని నమ్మకం కుదరగానే కాంగ్రెస్ పార్టీ మధ్యంతర ఎన్నికలు ప్రకటించావచ్చును. బహుశః జూన్ లేదా జులై నెలాకరులోగా ఎప్పుడయినా ఆ ప్రకటన చేయవచ్చును.