కుక్కలకీ ఉంటాయి జ్ఞాపకాలు

 


ఈ ప్రపంచంలోనే మనుషులకి విశ్వాసపాత్రమైన జీవి ఏదంటే కుక్కలే అంటారు. మరికొందరు ఇంకొంత దూరం వెళ్లి మనిషిని నమ్మడం కంటే కుక్కలని నమ్మడం మేలని తీర్మానించేస్తారు. విశ్వాసం ఉండటం వరకూ బాగానే ఉంది. కానీ మనతో ఉండే కుక్కలు నిరంతరం మనల్ని గమనిస్తూ, మన చర్యను జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటాయా అంటే అవుననే సమాధానం చెబుతోంది ఓ పరిశోధన.

 

Epsiodic Memory

పోయిన సంక్రాంతికి మీ ఊరికి వెళ్లినప్పుడు, అక్కడ ఎలా గడిచింది? క్రితంసారి మీ పుట్టినరోజు ఎలా జరిగింది? ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు మన దగ్గర సుదీర్ఘమైన సమాధానం ఉండి తీరుతుంది. మనుషులలో ఉండే ఈ తరహా జ్ఞాపకాలని ‘Epsiodic memory’ అంటారు. అంటే ఒక జ్ఞాపకాన్ని అది జరిగిన సమయం, సందర్భం, ప్రదేశాలతో సహా గుర్తుంచుకోవడం అన్నమాట. ఇలాంటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకునేటప్పుడు, ఆ సమయంలో అక్కడ ఎవరు ఉన్నారు? ఆ పరిస్థితిలో మనకు కలిగిన అనుభూతి ఏమిటి? వంటి విషయాలు కూడా స్ఫురిస్తాయి.

 

 

మనుషులకు మాత్రమే ప్రత్యేకం!

ఇంతవరకూ ఈ తరహా Epsiodic Memory కేవలం కోతులు, మనుషులు వంటి ఉన్నతశ్రేణి జీవులలో మాత్రమే ఉందని నమ్మేవారు. కానీ కుక్కలలో ఈ తరహా జ్ఞాపకాలు ఎంతవరకు నిక్షిప్తం అయ్యే అవకాశం ఉందో పరిశీలించారు హంగేరీకి చెందిన శాస్త్రవేత్తలు. అందుకోసం ఓ 17 కుక్కలను ఎన్నుకొన్నారు. ఇవన్నీ వేర్వేరు జాతులకు చెందినవి. పైగా యజమాని ఆజ్ఞను అనుసరించేలా శిక్షణ ఇవ్వబడ్డవి. పరిశోధనలోని మొదటి దశలో వీటి ముందు యజమానులు కొన్ని పనులు చేసి, తమ చర్యను అనుకరించమని ‘Do it’ అంటూ ఆజ్ఞాపించారు. వెంటనే వారి కుక్కలు వారి ఆజ్ఞను తూ.చా. తప్పకుండా పాటించాయి.

 

చెప్పకుండానే చేయమన్నారు

పరిశోధనలోని రెండో దశలో కుక్కలు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, యజమాని ఏదో పని చేస్తూ వాటికి కనిపించారు. గొడుగుని చేత్తో పట్టుకోవడం, కుర్చీ ఎక్కి నిల్చోవడం వంటి వింతపనులు చేశారు. ఆ తరువాత కాసేపటికి ‘Do it’ అంటూ ఆజ్ఞాపించారు. అలాంటి ఊహించని ఆజ్ఞ ఎదురైనప్పుడు కూడా కుక్కలు తన యజమాని అంతకు ముందు ఏం చేశాడో తిరిగి చేసిశాయి. అంటే ప్రత్యేకించి శిక్షణ లేని సమయంలో కూడా కుక్కలు తమ యజమాని చర్యలను గమనిస్తూ ఉన్నాయని రుజువైందన్నమాట. ఒక గంట గడిచిన తరువాత కూడా మూడో వంతు కుక్కలు తమ యజమాని అసంకల్పితంగా చేసిన చర్యని గుర్తుంచుకొని వాటిని అనుకరించడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు.

 

 

ఉపయోగం

ఇప్పటి వరకూ జ్ఞాపకశక్తి మీద జరిగిన పరిశోధనలు ఎక్కువగా మనిషి చుట్టూనే తిరిగాయి. కానీ ఈ పరిశోధనతో ఇతర జీవుల మెదడు సామర్థ్యం ఏమిటో కూడా తెలిసి వచ్చింది. పైగా మనిషిలో ‘నేను’ అనే స్పృహ ఉండటం వల్లే అతనిలో ‘Epsiodic Memory’ సాధ్యమంటున్నారు. మరి ఇతర జీవులలో కూడా ఇలాంటి స్పృహ ఉంటుందా? లేకపోతే వాటి మెదడు వేరే విధంగా పనిచేస్తోందా? వంటి సరికొత్త ప్రశ్నలకు ఈ పరిశోధన అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. మరి ఆ ప్రశ్నలకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో! అంతవరకూ మీ కుక్క మీ చర్యల్ని అతి జాగ్రత్తగా గమనిస్తోందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.                


 

 

- నిర్జర.