మెగాస్టార్ ఇంటర్వ్యూ: మనస్సాక్షికీ దట్టంగా మేకప్!!




 సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి, తనకున్న ప్రజాధారణతో ముఖ్యమంత్రి అవుదామనే కోరికతో మేకప్ తుడుచేసుకొని రాజకీయాలలోకి ప్రవేశించారు. కానీ ఆయనకు ఆశాభంగం అయింది. ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా దానిని కాంగ్రెస్ చేతిలో పెట్టడం వలన కేంద్రమంత్రి అవగలిగారు. కానీ రాష్ట్ర విభజన కారణంగా అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఆయనకు రాజకీయాలలో మరో ఎదురు దెబ్బగా చెప్పవచ్చును. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ, సినీ, కుటుంబ జీవిత విషయాల గురించి మాట్లాడారు.

 

ప్రజలు, అభిమానులు, తోటి కళాకారులు ఒత్తిడి మేరకు తను మళ్ళీ సినీ రంగంలో అడుగుపెడుతున్నాని, తన 150వ సినిమా త్వరలోనే ప్రారంభిస్తానని తెలిపారు. అయితే నిజానికి ఆయన రాజకీయ భవిష్యత్ అంతా అందకారంగా కనిపిస్తుండటంతోనే, కాంగ్రెస్ కండువాను తీసి పక్కనబెట్టి, మళ్ళీ మొహానికి రంగులు వేసుకొనేందుకు తయారవుతున్నారని అందరికీ తెలుసు.

 

ఆయన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించేందుకు పార్టీ ఎన్నికల ప్రచార రధసారధిగా భాద్యతలు స్వీకరించినపుడు, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి తుడిచి పెట్టేసేందుకు జనసేన పార్టీని స్థాపించారు. అప్పుడు చిరంజీవి తమ అభిమానులను జనసేన వైపు వెళ్ళకుండా కట్టడిచేసేందుకు గట్టిగానే ప్రయత్నించారు. అంతేకాక తన మరో సోదరుడు నాగబాబు, మరియు కొడుకు రామ్ చరణ్ తేజ్ ల ద్వారా మెగాభిమానులను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆయన ఇప్పుడు తమ్ముడు జనసేన పార్టీ పెట్టడాన్ని తను ఎన్నడూ వ్యతిరేఖించలేదని, చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

 

ఆయన ఎన్నికల ప్రచారంలో “కాంగ్రెస్ పార్టీని తుడిచి పెట్టడం ప్రపంచంలో ఏ శక్తి వల్లా కాదని, కాంగ్రెస్ పార్టీని డ్డీకొన్నవారే కాలగర్భంలో కలిపోతారని ” దృడంగా చెప్పారు. ప్రజలపై తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభావం అంతంతమాత్రమేనని దానివల్ల కాంగ్రెస్ కి వచ్చే నష్టమూ ఏమీ లేదని కూడా మరీ వాదించారు. చివరికి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా తరువాత కూడా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉందని అంగీకరించలేదు. కానీ ఆయన నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తమ్ముడు పవన్ కళ్యాణ్ కి తిరుగులేని ప్రజాధారణ ఉందని, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక బలమయిన కారణమేనని అంగీకరించారు.

 

తను గెలిపించాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీని తమ్ముడు రాష్ట్రం నుండే కాక దేశం నుండి కూడా సమూలంగా తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తుంటే, తమ్ముడు జనసేన పార్టీని పెట్టడం తనకు వ్యతిరేఖంగా కాక మద్దతుగానే పెట్టినట్లు భావిస్తున్నానని చెప్పడం మరో పెద్ద జోక్.

 

కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలుగుతునంత కాలం ఎన్నడూ తమ్ముడు ప్రస్తావన చేయని చిరంజీవి, ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన తరువాత తమ రక్త సంబంధాన్ని వేరు చేసే శక్తి రాజకీయాలకు లేవని చెప్పుకోవడం హాస్యాస్పదం. తను ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ లక్ష్మణుడిలా సేవలు చేస్తే, తమ్ముడు తన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ పెట్టుకొంటుంటే దానిని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి, ఇప్పుడు తాను ఎన్నడూ వ్యతిరేఖించలేదని, తమ దారులు వేరయినా ఇద్దరి ఆశయం ప్రజలకు సేవ చేయడమేనని చిరంజీవి చెప్పడం చూస్తే ఆ అన్నదమ్ముల వ్యక్తిత్వాలలో, మనస్తత్వాలలో ఎంత వైరుద్యం ఉందో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.

 

చిరంజీవి కేవలం ముఖ్యమంత్రి అవుదామనే ఏకైక లక్ష్యంతో రాజకీయాలలోకి వస్తే, పవన్ కళ్యాణ్ ప్రజల తరపున పోరాడేందుకు మాత్రమే వచ్చానని చెప్పడమే కాక, ప్రజాభిప్రాయలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చాలా శ్రమించారు.

 

రాష్ట్ర విభజన తరువాత అత్యంత దయనీయంగా మారిన రాష్ట్ర పరిస్థితులను సరిదిద్దేందుకు రాజ్యసభ సభ్యుడిగా యధాశాక్తిన కృషిచేయవలసిన చిరంజీవి, తన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా కనబడుతుండటంతో మళ్ళీ సినిమాలలో నటించేందుకు సిద్దమయిపోవడం చూస్తే, రాష్ట్రం పట్ల, అందులో ప్రజల పట్ల ఆయన నిబద్దత ఎటువంటిదో అర్ధమవుతుంది. కర్నాటక రాష్ట్రానికి చెందిన జైరామ్ రమేష్, మన రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపిక అయినందున, ఆయన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంతో పోరాడుతుంటే, మన రాష్ట్రానికి చెందిన చిరంజీవి సినిమాలలో నటించేందుకు సిద్దమయిపోవడం దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ కూడారాజకీయాలలోకి వచ్చి ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నప్పటికీ, ఆయన ఏనాడూ అన్నలాగా ఏ పదవులు ఆశించలేదు. అనుభవించడంలేదు. కానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి తన పూర్తి సమయాన్ని ప్రజాసమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించకుండా రాజకీయాలలో చేరిన తరువాత మసకబారిన తన పేరు ప్రతిష్టలను పునరుద్దరించుకోవడానికి మళ్ళీ సినిమాలలో నటించడానికి సిద్దమవుతున్నారు. నిబద్దత లేని ఇటువంటి పార్ట్ టైం రాజకీయ నాయకులు ఎంతమంది ఉంటే మాత్రం ఏమి లాభం? ఏమయినప్పటికీ చిరంజీవి నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో సగటు రాజకీయ నాయకుడిలాగే మాట్లాడారు. కానీ అది ఆయన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపించినట్లుంది.