మళ్ళీ తెలంగాణపై కొత్త రాగాలు

 

రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, హోంమంత్రి షిండే ఇద్దరూ తెలంగాణపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని ఎంత గట్టిగా చెపుతున్నాకూడా మీడియాలో మాత్రం రోజుకో కధనం వండి వడ్డించబడుతూనే ఉంది.

 

ఈ రోజు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఇక తెలంగాణా వచ్చేసినట్లే అంతా ఖాయమయి పోయింది’ అంటూ తెలంగాణావాదులకు మంచి కమ్మటి వార్త అందిస్తే, మరో పత్రిక ‘వర్కింగ్ కమిటీ తరువాత అఖిలపక్ష సమావేశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2వ యసార్సీ గురించి కూడా ఆలోచిస్తోంది’ అంటూ ఒక వార్త మోసుకు వచ్చింది. మరి ఈ విధంగా రకరకాల వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఎవరు ఇటువంటి కబుర్లు వారికి అందజేస్తున్నారు? అసలు వాటిలో నిజమెంత అబద్దమెంత? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.

 

మీడియాలో నిత్యం వండి వడ్డించే ఇటువంటి వార్తల వలన ప్రజలలో ఆందోళన మరింత పెరుగుతుంది. గనుకనే దిగ్విజయ్ సింగ్, షిండే ఇద్దరూ కూడా పదేపదే రాష్ట్ర విభజన అంశంపై ప్రకటనలు చేయక తప్పడం లేదు.

 

మరి ఈ వార్తలపై వెంటనే స్పందించకపోతే ఏమి జరుగుతుంది అందరికీ తెలిసిందే గనుక కాంగ్రెస్ నేత అహ్మద్‌పటేల్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించే ప్రసక్తి లేదు. అవన్నీ ఒట్టి వదంతులేనని తేల్చిపారేసారు.

అందువల్ల ప్రజలు కూడా త్వరలో జరుగబోయే వర్కింగ్ కమిటీ కోసమే ఓపికగా ఎదురుచూడటం మంచిది.