ఇలాంటి డాక్టర్లు ఉంటే ఎంత బాగుండో!

 

వైద్యమూ, వ్యాపారమూ ఇప్పుడు కలగాపులగం అయిపోయాయి. ఇందుకోసం మనం ప్రత్యేకించిన అధ్యయనాలు చేయనవసరం లేదు. వైద్యం మునుపటిలా నిస్వార్థంగా లేదన్నది ప్రతి ఒక్కరి అనుభవమే! ఇలాంటి సమయంలో ఓ 91 ఏళ్ల డాక్టరు విలువల గురించి సమాజానికి ఓ సరికొత్త పాఠాన్ని చెబుతున్నారు.

 

మొదటి డాక్టర్

ఇప్పుడంటే ఆడపిల్లల చదువు గురించి ప్రత్యేకించి పోరాడాల్సిన పని లేదు. కానీ స్వాతంత్రానికి ముందర ఈ పరిస్థితి ఎలా ఉండేదో చరిత్ర చెబుతూనే ఉంది. ఆడపిల్ల డిగ్రీ సాధించడమే గగనం అనుకునే అలాంటి పరిస్థితులలో భక్తి యాదవ్ అనే మహిళ ఏకంగా MBBS పట్టాని సాధించింది. ఇండోర్లోని MGM మెడికల్ కాలేజి నుంచి 1948లోనే ఈ ఘనతని అందుకుంది. అలా ఇండోర్లోని తొలి మహిళా వైద్యురాలిగా నిలిచింది.

 

పేదల కోసమే!

వైద్య పట్టా చేతికి రాగానే ఎక్కడ ప్రాక్టీసు పెడదామా, ఎంత లాభపడదామా అనే ఆలోచనలు రావడం సహజం. కానీ ప్రభుత్వాసుపత్రిలో చేరమంటూ ఆహ్వానం వచ్చినా, భక్తి యాదవ్ తొందరపడలేదు. ఆ సమయంలో Nandlal Bhandari Mills అనే సంస్థ పేద మిల్లు కార్మికుల కోసం ఓ ప్రసూతి ఆసుపత్రిని నడిపేది. అందులో చేరిపోయారు భక్తి. 1978లో ఆ సంస్థ మూతబడిన తరువాత ‘వాత్సల్య’ పేరుతో ఒక ఆసుపత్రిని ప్రారంభించారు.

 

పైసా తీసుకోకుండా

1970లలో వైద్యం చాలా అరుదైన సౌకర్యంగా ఉండేది. అందులోనూ ప్రసూతి వైద్యం చేసే మహిళా డాకర్లు మరింత అరుదుగా ఉండేవారు. అలాంటి సమయంలో తన దగ్గరకు ఎలాంటి రోగులు వచ్చినా అక్కున చేర్చుకునేవారు భక్తి యాదవ్. రోగులు తమంతట తాముగా ఎంతోకొంత ఇస్తే తప్ప... ఇంత రుసుము చెల్లించాలి అని చేయి చాచిన సందర్భం ఎప్పుడూ లేదు. అలా వేలకొద్దీ గర్భిణీ స్త్రీలకు ఉచితంగానే పురుడు పోసారు. వాటిలో అధికశాతం నార్మల్ డెలివరీలే కావడం గమనార్హం.

 

విశ్రాంతి లేదు

భక్తి యాదవ్‌ను ఇండోర్ వాసులు ప్రేమగా అమ్మ అని పిలుస్తారు. ఆమె హస్తవాసి గురించి విన్న రోగులు రాష్ట్ర సరిహద్దులు దాటుకుని మరి ఇండోర్‌కు చేరుకునేవారు. అలాంటివారిని చూస్తూ భక్తి యాదవ్ ఎలా విశ్రాంతిగా ఉండగలరు? అందుకే ఆరోగ్యం సహకరించకపోయినా, వయసు మీద పడినా కూడా తన నర్సింగ్‌ హోమ్‌కు చేరుకున్న రోగులని పరీక్షించేవారు. గైనకాలజీలో భక్తియాదవ్‌ది అపారమైన నైపుణ్యం. ఆమె చేతితోనే చేసే పరీక్షల ముందు ఆధునిక యంత్రాలు కూడా బలాదూర్ అన్నది రోగుల నమ్మకం.

 

సలహా కోసం

ఏడాది క్రితం రోగులను పరీక్షిస్తుండగా, భక్తియాదవ్ కిందపడి గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయిలో రోగులను చూసే పరిస్థితిలో లేరు. నర్సింగ్ హోమ్ బాధ్యతలన్నీ వైద్యులైన ఆమె కొడుకు, కోడలే చూసుకుంటున్నారు. అయినా సరే! భక్తియాదవ్ సూచనల కోసమైనా జనం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సంతానం లేనివారు సైతం ఆమె అందించే సలహా కోసం పడిగాపులు కాస్తుంటారు.

 

ఇప్పటి వైద్యులని చూస్తే...

తన సేవలతో కొందరి జీవితాలైనా సంతోషంగా ఉన్నాయన్న విషయం భక్తి యాదవ్కు తృప్తినిస్తుంది. భక్తి యాదవ్ సేవలను చూసి భారత ప్రభుత్వం సైతం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. అయినా ఆమెలో ఏదో అసంతృప్తి. ఇప్పటి వైద్యులు యాంత్రికంగా మారిపోతున్నారన్న ఆవేదన. వైద్యం అంటే కేవలం శరీరాన్ని బాగుచేయడం కాదు, మనిషిలో తిరిగి తన పట్ల నమ్మకాన్ని పెంపొందించడం అన్నది భక్తియాదవ్ దృక్పథం. అందుకే తన దగ్గరకు వచ్చిన రోగులను ఆమె బంధువులా ఆదరించేవారు. వారి బాగు కోరుకునే ఆత్మీయురాలిగా మెలిగేవారు. అవసరం అనుకుంటే తన రోగులను చూసేందుకు, సైకిల్ తొక్కుకుంటూ ఎంత దూరమైనా వెళ్లేవారు. కానీ ఇప్పటి వైద్యులలో ఆడంబరం, స్వార్థం, ఉదాసీనత పెరిగిపోయాయన్నది డా॥ భక్తి యాదవ్ ఆవేదన.

- నిర్జర.