సంతోషంగా ఉండేందుకు ఓ బౌద్ధ భిక్షువు చిట్కాలు...!

 

ఫ్రాన్స్‌కు చెందిన మాథ్యూ రికార్‌ (Matthieu Ricard) అందరిలాగే బుద్ధిగా చదువుకునేవాడు. ‘మాలిక్యులర్‌ జెనెటిక్స్‌’లో పీహెచ్‌డీ సైతం సాధించాడు. కానీ విజ్ఞానశాస్త్రం లోతులు చూస్తున్న కొద్దీ, తన మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలనిపించింది మాథ్యూకి.

 

అందుకోసం ఫ్రెంచ్‌ తత్వవేత్తలు రాసిన పుస్తకాలన్నింటినీ చదవడం మొదలుపెట్టాడు. చివరికి భారతదేశమే తనలోని ఆధ్మాత్మిక జిజ్ఞాసకు దారిచూపగలదని నిశ్చయించుకున్నాడు. అలా ఇండియాకు చేరుకున్న మాథ్యూ బౌద్ధమతాన్ని పుచ్చుకొని నేపాల్‌లో స్థిరపడిపోయాడు.

 

మాథ్యూ గురించి విన్న కొందరు పరిశోధకులు మెదడు మీద ధ్యానం కలిగించే ప్రభావాన్ని అంచనా వేసేందుకు, అతన్ని ఎంచుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 12 సంవత్సరాల పాటు దఫదఫాలుగా ఆయనని పరిశీలించి చూశారు. మాథ్యూ మెదడుకి 256 సెన్సర్లు అమర్చి, ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన మెదడు ఎలా పనిచేస్తోందో గ్రహించే ప్రయత్నం చేశారు.

 

మాథ్యూ ధ్యానం చేస్తున్నప్పుడు, అతని మెదడులో ఏర్పడుతున్న తరంగాల స్థాయిని చూసి పరిశోధకులే ఆశ్చర్యపోయారు. ఆ స్థాయిలో ఇదివరకు ఎప్పుడూ తరంగాలు నమోదవలేదని తేల్చారు. ఎంతో ప్రశాంతంగా ఉంటే తప్ప మెదడులో అలాంటి చర్య సాధ్యం కాదని గ్రహించారు.

 

ఈ పరిశోధన బయటకు రావడంతో మీడియా అంతా ఆయనని "happiest person in the world" అంటూ ఆకాశానికి ఎత్తేసింది. కానీ తనకు అలాంటి బిరుదులేవీ వద్దని, తనని మించిన ఆధ్యాత్మికవేత్తలు ఎందరో ఉన్నారని మాథ్యూ చెబుతూ ఉంటారు.

 

ఇంతకీ మాథ్యూ మనసు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగితే... ఆయన చెప్పే సమాధానాలు వినండి. బహుశా అవి మనకు కూడా ఉపయోగపడతాయేమో!

 

- ఎప్పుడూ ‘నేను, నేను, నేను’ అంటూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటే ప్రపంచం మొత్తం నీకు శత్రువులాగానే కనిపిస్తుంది. దాంతో మనశ్శాంతి కరువవుతుంది. జాలి, కరుణ, పరోపకారం లాంటి భావనలు చోటు చేసుకున్నప్పుడు మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.


- ఎంతసేపూ సుఖాన్ని అందించే అనుభవాల కోసం వెంపర్లాడుతూ ఉంటే... సంతోషం ఎప్పటికీ దక్కదు. అలాంటి వెంపర్లాటతో అలసట తప్ప మేరమీ మిగలదు.

 

- సంతోషం ఒక మానసిక స్థితి. జీవితంలోని ఒడిదొడుకులను ఎదుర్కొనేందుకు కావల్సిన శక్తిని అది అందిస్తుంది.


- సహనం చాలా ముఖ్యం. ఓర్పు ఫలం ఎప్పుడూ తియ్యగా ఉంటుంది. ఓర్పుతో ఉన్నప్పుడు, అద్భతమైన వ్యక్తిత్వం ఏర్పడేందుకు అవసరమయ్యే సుగుణాలన్నీ మనలో ఏర్పడతాయి.

 

- జీవితం నిరాశాజనకంగా ఉందని ఎప్పుడూ డీలా పడిపోవద్దు. అలాంటి సమయంలో కాస్త ఓర్పుగా ఉంటే అనుకోని మార్పులు సంభవిస్తాయి.


- రోజుకి కనీసం 10-15 నిమిషాల పాటు మనసుని సంతోషకరమైన ఆలోచనలతో నిలిపి ఉంచే ప్రయత్నం చేస్తే జీవితమే మారిపోవడాన్ని గమనించవచ్చు.

 

- జీవితంలో ఎలాగైతే కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ మన మెదడుకి శిక్షణ ఇస్తూ ఉంటామో... అలాగే జాలి, పరోపకారం, కరుణ లాంటి మంచి లక్షణాలను కూడా మెదడుకి అలవాటు చేయడం సాధ్యమే!

 

- ఒకేసారి గంటల తరబడి ధ్యానంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా కొద్ది నిమిషాల సేపైనా చేసే ధ్యానం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. క్రమం తప్పకుండా నడిచేవాడు ఒలింపిక్స్‌కి వెళ్లి పతకం సాధించలేకపోవచ్చు.... కానీ అలసట లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసే నైపుణ్యాన్ని సాధిస్తాడు కదా!

- నిర్జర.