మసూద్ అజార్‌ను అరెస్టు చేశాం- పాకిస్తాన్
posted on Feb 23, 2016 8:52AM

పఠాన్‌కోట్ వైమానిక స్థావరానికి సంబంధించి పాకిస్తాన్ మరోసారి పొంతనలేని మాటలను మొదలుపెట్టింది. జైష్-ఎ-మహమ్మద్ అనే తీవ్రవాద సంస్థకు నాయకుడైన మసూద్ అజారే ఈ కుట్రకు ప్రేరణ అని భారత్ మొదటి నుంచీ విశ్వసిస్తోంది. కానీ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న మసూద్‌ని అరెస్టు చేసేందుకు కానీ విచారించేందుకు కానీ పాకిస్తాన్ ఎలాంటి చర్యలూ తీసుకోనేలేదు. మన దేశం, మసూద్ అజారే పఠాన్‌కోట్ అలజడులకు కారణమని గంపెడు సాక్ష్యాలను చూపించినా ఆ దేశం పెదవి విరిచేసింది. పైగా పఠాన్‌కోటకు సంబంధించి నమోదు చేసిన F.I.Rలో ‘కొందరు గుర్తుతెలియని వ్యక్తులు’ పఠాన్‌కోట్ దాడికి కారణం అంటూ పేర్కొంది.
కానీ ఇప్పుడు ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు అజీజ్ ఒక టీవీ ముఖాముఖిలో పాల్గొంటూ మౌలానా అజార్‌ను అప్పుడెప్పుడో అరెస్టు చేసేశాంగా అని బాంబు పేల్చారు. జనవరి 14 నుంచే ఆయన పోలీసుల నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. అన్నాళ్లూ మౌలానా అజార్‌ను ఏం చేశారు అంటే కిమ్మనకుండా ఉన్న పాకిస్తాన్ ఇలా హఠాత్తుగా ప్లేటు ఫిరాయించడం వెనుక కారణం ఏంటో తెలియడం లేదు. ప్రస్తుతం కశ్మీర్లో మళ్లీ తీవ్రవాద కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. దాంతో ఎలాగూ పాకిస్తాన్ వైపే అందరూ వేలెత్తుతారు. అందుకనే పాకిస్తాన్ నేర్పుగా ఈ ప్రకటన చేసిందని భావిస్తున్నారు విశ్లేషకులు. దానివల్ల మేం తీవ్రవాదులని ఏం పోషించడం లేదు, వారి మీద ఉక్కుపాదాన్ని మోపుతూనే ఉన్నాం అని ప్రపంచం దృష్టిని నమ్మించడంలో భాగంగానే ఈ ప్రకటన వచ్చి ఉండవచ్చు. ఇంతకీ మసూద్ అజార్‌ను అరెస్టు చేసినట్లా? చేయనట్లా?