జడ్జ్ గా రిటైర్ అయ్యాడు... ముద్దాయిగా బోనెక్కనున్నాడు!

జస్టిస్ మార్కండేయ కట్జూ... ఈ పేరు ఇప్పుడు అందరికి బాగా తెలిసిన టైటిల్! అసలు ఒక మాజీ సుప్రీమ్ న్యాయమూర్తి పేరు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. తెలిసే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే, ప్రస్తుతం సుప్రీమ్ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి... ఇలాంటి వారి పేర్లే పిల్లలు పోటీ పరీక్షల కోసం చదువుకుంటూ వుంటారు. అంతే తప్ప మిగతా వారు ఏ మాత్రం పట్టించుకోరు. కాని, ఆల్రెడీ రిటైర్ అయిపోయిన కట్జూ మాత్రం తెగ పాప్యులర్! ఒక మాజీ జస్టిస్ కి ఇంత సీన్ క్రియేట్ అవ్వటం ఆశ్చర్యకరమే!

మార్కేండయ కట్జూ జనం నోళ్లలో నానటానికి అసలు కారణం ఆయన జిహ్వ చాతుర్యం. మరే ఇతర జడ్జీ మాట్లాడనంత పబ్లిగ్గా, డేరింగ్ గా ఈయన మాట్లాడతాడు. అందుకు సోషల్ మీడియాను వేదికగా  ఎంచుకుంటాడు. అది ఎంతటి సున్నితమైన విషయం అయినా, ఎంతటి వివాదాస్సద విషయం అయినా తనకు తోచింది రాసేస్తాడు. ఆయన ఫేస్బుక్ పోస్టుల గురించి రాసుకుంటూ పోతే మరో బుక్కై కూర్చుంటుంది. అంతలా సెన్సేషన్ క్రియేట్ చేశాడు తన ఒక్కో పోస్టుతో!

కట్జూ ఈ మధ్య కాలంలో చేసిన వివాదాస్పద పోస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ... మదర్ థెరిసా ఒట్టి బోగస్ అన్నాడు! ఆమెకు పోప్ సెయింట్ హుడ్ ఇచ్చిన వేళ చెలరేగిపోయాడు. మదర్ థెరిసా అభిమానులు ఏమనుకుంటున్నారన్న ఆలోచన అస్సలు లేకుండా ఘాటు కామెంట్స్ చేశాడు. థెరిసా మత ప్రచారమే తప్ప నిజమైన సేవ ఏం చేయలేదని, అబార్షన్ వంటి అంశాల విషయంలో క్రిస్టియన్ ఛాందసవాదం కనబరించిందని కుండబద్దలు కొట్టాడు. అక్కడితో ఆగకుండా ఆమెకిచ్చినట్టు తనకు వేలాది డాలర్లు విరాళాలు ఇస్తే తానూ మదర్ థెరిసాలా సేవ చేస్తానని సెటైర్ వేశాడు. మదర్ నే వదలని కట్జూ అరవింద్ ని వదులుతాడా? కేజ్రీవాల్ బుర్రలో ఏమీ లేదని అనేశాడు ఆ మధ్య!ఇలా ముఖ్యమంత్రి, మానవతా మూర్తి అన్న తేడాలేవీ వుండవు కట్జూకి!

ఒక మాజీ జస్టిస్ గా తనదైన స్టైల్లో స్పందించే కట్జూ తాజాగా మాత్రం చిక్కుల్లో పడ్డాడు. ఆయన ఓ రేప్ కేసు విషయంలో సుప్రీమ్ తీర్పునే తప్పుబట్టాడు. సౌమ్య అనే అమ్మాయి అత్యాచారానికి, హత్యకి గురైతే నిందితుడికి మొదట మరణ శిక్ష పడింది. కాని, తరువాత అత్యున్నత న్యాయస్థానం జీవిత ఖైదుగా మార్చేసింది. దీన్ని ఫేస్బుక్ లో పబ్లిగ్గా తప్పుబట్టాడు కట్జూ. కోర్టు సరిగ్గా ఆధారాలు అధ్యయనం చేయలేదని రకరకాలుగా ఆరోపణలు చేశాడు. మొత్తానికి ఇప్పుడు ఆ విమర్శలే కోర్టు దృష్టికి వెళ్లాయి. ఏకంగా సుప్రీమ్ కోర్టు ఈయన వ్యవహారాన్ని సుమోటోగా స్వకరించి న్యాయస్థానానికి రావాలని నోటీస్ ఇచ్చింది. త్వరలోనే కట్జూ కోర్టు మెట్లాక్కాల్సి వుంటుంది! కాకపోతే ఈసారి దర్పంగా జస్టిస్ గా కాదు... కోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సిన వాడిగా వెళ్లాల్సి వస్తుంది!

మార్కండేయ కట్జూ ఒక మాజీ న్యాయమూర్తి. ఆయన చెప్పే మాటలు నిజమైతే కావొచ్చు. కాని, చెప్పే పద్ధతి అంటూ కూడా ఒకటి వుంటుంది. మదర్ థెరిసా నుంచీ సుప్రీమ్ కోర్టు వరకూ అందరనీ, అన్నిట్నీ విమర్శిస్తే ఎప్పటికైనా కష్టాలు కొనితెచ్చుకున్నట్టే! అదీ ఘాటైన పదజాలాలు వాడుతూ విజృంభిస్తే మరీ ఈజీగా దొరికిపోయే ఛాన్స్ వుంది! మరి ఈ విషయం తాజా సుప్రీమ్ నోటీసుల తరువాత అన్నా అర్థం చేసుకుంటాడో లేదో... వేచి చూద్దాం!