TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ మావోల బెడద

Published on: Tue Mar 27, 2012 11:03AM

ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వామపక్ష తీవ్రవాద మావోల నుంచి ముప్పు ఎదురవుతోంది. ఆంద్ర-ఛత్తీస్ ఘడ్, ఆంద్ర-మహారాష్ట్ర, ఆంద్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మావోయిస్టుల కదలికలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైయస్సార్ హయాంలో చావుదెబ్బ తిన్న మావోయిస్టులు వ్యూహాత్మకంగా వెనుకడుగు వేశారు. తమ క్యాడర్ ను మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, బీహార్ లకు పంపివేశారు. క్రమంగా పోలీసులు కూడా రాష్ట్రంలో తమ పట్టును సడలించడంతో మావోయిస్టు క్యాడర్ అంతా ఇప్పుడు సరిహద్దుల్లో మాటువేసి దాడికి సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో గతంలో జరిగిన అనేక ఎదురుదెబ్బలకు ఒక పెద్ద సంఘటన ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని మావోయిస్టులు వ్యూహం పన్నుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

 

దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపులు జరుపుతున్నారు. మావోయిస్టులు ప్రజాప్రతినిధులపై దాడులు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని హెచ్చరిస్తున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని ప్రజాప్రతినిధులకు పోలీసులు ఇప్పటికే సలహా ఇచ్చారు. ఏజెన్సీప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కొంతకాలం పాటు కుటుంబసభ్యులతో సహా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళడం మంచిదని కూడా పోలీసులు వారికి చెబుతున్నారు. అబూజ్ ఘడ్ లో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణా ప్రాంతాలకు తరలివచ్చే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరించింది. చాలాకాలం తరువాత రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి మళ్ళీ ప్రారంభం కావడంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వణికిపోతున్నారు.