ఏడ్చే మగవాడిని నమ్మితీరాల్సిందే!

 

 

ఏడ్చే మగవాడనికి నమ్మకూడదు అంటారు? కానీ రోజులు మారాయి. దాంతోపాటుగా నమ్మకాలు కూడా మారాల్సిందే! ఆడవారైనా, మగవారైనా ఏడిస్తే వ్యక్తిత్వం బలపడుతుంది! అంటున్నారు. ఎందుకో మీరే చూడండి.
 

ఒత్తిడి నుంచి ఉపశమనం:-
 
మనసుకి తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు, దానిని గుండెలోతుల్లో అదిమిపెట్టి ఉపయోగం లేదు. అలా అణిచిపెట్టుకున్న దుఃఖం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అదే కష్టాన్ని కన్నీళ్ల ద్వారా బయటకు పంపేస్తే మనసు తేలికపడుతుంది. కష్టం దగ్గరే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది. అంతేకాదు! మనసు తేలికపడిన తర్వాత అసలు సమస్య ఎక్కడ వచ్చింది? దానిని అధిగమించడం ఎలా అనే స్పష్టత ఏర్పడుతుంది.
 

తెగింపుకి సూచన:-
 
మనసులో ఎంత బాధ ఉన్నా పైకి గంభీరంగా నటిస్తాము. మగవాళ్లు ఏడిస్తే బాగోదు కదా! అన్న ఆలోచనతో కన్నీటి ఉగ్గబట్టుకుని కుమిలిపోతుంటాము. కానీ అవతలివారు ఏమనుకుంటారో! అన్న ఆలోచనని అధిగమించిన రోజునే తెగించి కన్నీళ్లు పెట్టుకోగలం. అందుకే స్వచ్ఛమైన మనసుకీ, భేషజాలెరుగని వ్యక్తిత్వానికీ సూచనగా ఏడుపు నిలుస్తుంది!
 

ఎదుటి వ్యక్తికి సాంత్వన:-
 
ఎదుటివాడి కష్టాన్ని చూసి కంటనీరు పెట్టుకున్నారనుకోండి! అవతలివారికి మీరు తన పట్ల సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం కలుగుతుంది. తన కష్టసుఖాలను మీతో పంచుకోగల నమ్మకం వస్తుంది. ఒకవేళ మీరే ఎదన్నా తప్పు చేశారనుకోండి.... ‘తప్పయిపోయిం’దంటూ కంటనీరు పెట్టుకుంటే, అవతలివారి మనసులో మీ పట్ల ఉన్న దురభిప్రాయం కాస్తా తొలిగిపోతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా కన్నీరు బంధాలను నిలబెట్టినట్లే లెక్క!
 

స్పందనకు ప్రతిరూపం:-
 
కష్టానికి త్వరగా స్పందించే మనసు ఉన్నవారే... బొటబొటా కన్నీటిని విడుస్తుంటారు. ఇలాంటి సున్నితమైన మనసు ఉన్నవారు సహజంగా ఏ కవిగానో, చిత్రకారునిగానో మారి అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇతరుల కష్టాలని తీర్చేందుకు సమాజసేవకులుగానూ మారుతుంటారు. ప్రపంచపు బాధని తీర్చే శాస్త్రవేత్తలుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు!
 

ఆరోగ్యానికీ ఢోకా ఉండదు:-
 
కష్టాన్ని కన్నీటి ద్వారా బయటకు పంపేస్తే గుండెకు ఎలాగూ మంచిదే! అంతేకాకుండా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్‌ వంటి విషరసాయనాలన్నీ కన్నీటి ద్వారా బయటకు వెళ్లిపోతాయట! పైగా కన్నీటిలో ఉండే ‘లైసోజైం’ అనే అరుదైన రసాయనం శరీరంలోని హానికారక బ్యాక్టీరియాని నిర్వీర్యం చేయగలదు.
 
ఏడుపు వల్ల అటు వ్యక్తిత్వానికీ ఇటు ఆరోగ్యానికీ ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట! ఇప్పుడు చెప్పండి ఏడ్చే మగవాడిని నమ్మకుంగా ఎలా ఉండగలం!                    
 


 - నిర్జర.