భట్టికి పట్టం కట్టిన రాహుల్

 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత ఎవరనే ఉత్కంఠత వీడింది.  సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నియమించారు. సీఎల్పీ నేత ఎన్నిక పరిశీలకుడు కేసీ వేణుగోపాల్‌ గత రెండు రోజులుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సీఎల్పీ నేత నియామకంపై సమాలోచనలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒకే పేరును ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి లేకపోవడంతో.. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను రాహుల్‌కు అప్పగిస్తూ ఓ తీర్మానం చేశారు. దీంతో సీఎల్పీ నేత ఎన్నిక బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం చేతిలోకి వెళ్లింది. సీఎల్పీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పోటీ పడగా.. చివరకు భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సీఎల్పీ నేతగా నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎల్పీ పదవికి మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఆసక్తి వ్యక్తపరిచారు. అయితే సభలో అధికార పార్టీని ఢీకొనేందుకు వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఉన్న నేత అవసరమని భావించిన అధిష్ఠానం చివరకు భట్టి వైపే మొగ్గు చూపింది. పార్టీలో సీనియారిటీ, మూడుసార్లు వరుసగా గెలుపొందడం, సామాజిక సమీకరణాలు భట్టి ఎంపికకు కలిసొచ్చాయి.