మలేషియా విమాన దుర్ఘటనకి ఎవరిని నిందించాలి?

 

మలేషియా విమాన దుర్ఘటనలో 293 మంది చనిపోయారు. అందుకు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడమో లేక ప్రకృతి వైపరీత్యమో కారణం కాదు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం అందుకు కారణం. అది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతీన్ ప్రయాణిస్తున్న విమానం అనుకొని పొరబడి ఉక్రెయిన్ సైనిక దళాలు పేల్చివేసాయని రష్యా దేశం ఆరోపిస్తుంటే, అది ఉక్రెయిన్ కి చెందిన విమానమని పొరబడి రష్యా వేర్పాటువాదులు కూల్చివేసారని ఇరు దేశాలు ఒకదానినొకటి నిందించుకొంటున్నాయి. ఏమయినప్పటికీ వారి పొరపాటుకు ఇతరులు భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఈ నేరం చేసినవారికీ, ఇటువంటి తీవ్ర నేరాలు చేసే తాలిబాన్ తీవ్రవాదులకి తేడా ఏమిటంటే తాలిబన్లు కనీసం ఆ నేరం తామే చేసామని దైర్యంగా చెప్పుకొంటారు. కానీ వీరు చెప్పుకోవడం కాదు కనీసం ఒప్పుకోవడం లేదు కూడా. అందువల్ల ఈ ఘోర సామూహిక హత్యా నేరానికి పాల్పడినవారు ఏ దేశానికి చెందినవారయినప్పటికీ బహుశః తాలిబాన్లలాగే శిక్ష నుండి తప్పించుకొనే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

 

ఇక ఈ దుర్ఘటనకు ఆ రెండు దేశాలనే కాక మలేషియన్ ఎయిర్ లైన్స్ సంస్థను కూడా నిందించకతప్పదు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొని ఉందని గ్రహించగానే కొరియన్ ఎయిర్, ఏషియానా(దక్షిణ కొరియా), క్వంటాస్(ఆస్ట్రేలియా), చైనా ఎయిర్ లైన్స్ (తైవాన్),క్యాతీ పసిఫిక్ (హాంగ్ కాంగ్), పాకిస్తాన్ ఇంటర్ నేషనల్ (పాకిస్తాన్) వంటి అనేక దేశాలకు చెందిన విమానయాన సంస్థలు తమ విమానాలను ఆ ప్రాంతం మీదుగా నడపకుండా జాగ్రత్తపడ్డారు. కానీ మలేషియా, భారత్, అమెరికాతో సహా అనేక దేశాల విమానాలు నేటికీ ఆ ప్రాంతం మీదుగానే పయనిస్తున్నాయి.

 

బ్రెజిల్ దేశం నుండి స్వదేశానికి తిరుగు ప్రయాణమయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ పయనించిన విమానం కూడా ఆ ప్రాంతం మీద నుండే రావలసి ఉంది. కానీ ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమయిన అధికారులు మోడీ విమానాన్ని వేరే సురక్షిత మార్గానికి మళ్ళించారు. అంటే ఎంత సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, ఏదయినా ప్రమాదం లేదా దుర్ఘటన జరిగితే తప్ప ఎవరూ మేల్కొనరని అర్ధమవుతోంది. ఇప్పుడు అమెరికా కూడా తన విమానాలను ఆ మార్గం గుండా నడిపించబోమని ప్రకటించింది. బహుశః భారత్ తో సహా మిగిలిన దేశాలు కూడా అదేపని చేయవచ్చునేమో.

 

ఈ గుణపాఠం నేర్చుకొనేందుకు293 మంది బలికావలసి రావడమే దురదృష్టం. దానిని దురదృష్టం అనుకోవడం కంటే నిర్లక్ష్యం అనుకోవడమే సమంజసం. ఎందువలన అంటే వేరే మార్గం గుండా విమానాలను నడిపినట్లయితే, దూరం పెరిగి ఇంధన ఖర్చు మరికొంత పెరుగుతుంది. గనుకనే ఆ ప్రాంతంపై నుండి ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా విమానాలు నడుపుతున్నారు. సాధారణంగా ఆ స్థాయి ప్రయాణికులు భద్రత కోసం అవసరమయితే మరికొంత భారం భరించగల స్తోమత గలవారే అయి ఉంటారు. కానీ చౌక ధరల విషయంలో పోటీలు పడుతున్న విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రతను గాలి కొదిలిపెట్టి ప్రమాదకరమయిన యుద్ద ప్రాంతం మీదుగా విమానాలు నడపడం చాలా దారుణం.

 

అందుకు వారి వద్ద గొప్ప సంజాయిషీ కూడా సిద్దంగా ఉంది. ఆ ప్రాంతంలో 10,000 మీటర్లు లేదా 33,000 అడుగుల ఎత్తులో విమానాలు ఎగిరేందుకు సురక్షితమని, కానీ అంతకంటే తక్కువ ఎత్తులో అంటే 32, 0000 అడుగుల ఎత్తులో విమానాలు ప్రయాణించడం నిషేదించబడిందని, ఈ దుర్ఘటన జరిగినప్పుడు తమ విమానం ఖచ్చితంగా 33,000 అడుగుల ఎత్తులో పయనిస్తోందని మలేషియా అధికారుల వాదన. ఆయితే వారి వాదనలేవీ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేవు, కనీసం ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వవని తేలిపోయింది.

 

ఈ దుర్ఘటన పొరపాటునే జరిగి ఉండవచ్చు, కానీ ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి అనేక దేశాలలో నేటికీ ఉగ్రవాదుల దాడులతో, విమాన దాడులతో ఉద్దేశ్యపూర్వకంగానే మారణ హోమం జరుగుతూనే ఉంది. అందులో వేలాది అమాయక ప్రజలు, అన్నెం పున్నెం తెలియని పసిపిల్లలూ నిత్యం చనిపోతూనే ఉన్నారు. అటువంటి దుష్క్రత్యాలను అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తాయి. కానీ ఈ నేరానికి పాల్పడిన వారిని మాత్రం ఎవరూ వేలెత్తి చూపరు. కేవలం ఖండిస్తారు, దిగ్భ్రాంతి ప్రకటిస్తారు అంతే.