జూబ్లీహిల్స్‌ అగ్నిప్రమాదం....ప్రాణాలతో బయటపడ్డ ఆరుగురు కార్మికులు

posted on: Feb 26, 2026 2:35PM

 

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్‌లో మాన్యవర్, మంగళగౌరీ దుకాణాలు ఉన్న భవనానికి ఎలివేషన్ పనులు జరుగుతున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. పై అంతస్తులో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎలివేషన్ కోసం నిర్మించిన తాత్కాలిక కట్టడంపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలోని మూడో అంతస్తులో ఇద్దరు మహిళలు, ఐదో అంతస్తులో నలుగురు పురుష కార్మికులు పని చేస్తుండగా పొగతో పాటు మంటలు వేగంగా వ్యాపించడంతో వారు లోపలే చిక్కుకుపోయారు. మంటలు చుట్టుముట్టడంతో మహిళలు అరుపులు, కేకలు వేస్తూ సహాయం కోసం ప్రయత్నించినప్పటికీ మొదట ఎవరూ స్పందించలేదని బాధితులు తెలిపారు.

ఐదో అంతస్తులో ఉన్న ఒక మహిళ భర్త మూడో అంతస్తుకు చేరుకుని అక్కడి అద్దాలను పగలగొట్టాడు. రాజు అనే కార్మికుడు నిచ్చెనలను కిందికి వేసి బయటకు రావడానికి మార్గం కల్పించాడు. అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో ఇద్దరు మహిళలు సురక్షితంగా కిందికి దిగారు. అనంతరం మిగతా నలుగురు కార్మికులు కూడా బయటపడగలిగారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం, గత వారం రోజులుగా ఈ భవనంలో పనులు చేస్తున్నామని, ప్రమాద సమయంలో తమను పనిలోకి పెట్టుకున్న యజమాని ఫోన్ కూడా ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...