మజ్లిస్ కూడా కాంగ్రెస్ పార్టీకి (అ)విశ్వాసం ప్రకటిస్తోందా?

 

మజ్లిస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీతో తలాక్ చెప్పుకొని బయటపడిన తరువాత తంతే బూరెల గంపలో పడినట్లు వెళ్లి జైల్లో పడ్డారు. బూరెలో గంపలో పడితే బూరెలు తినే అవకాశం ఉన్నట్లే, జైల్లో పడితే తమ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రచారం, వివిధ టీవీ చానళ్ళలో ఇంటర్వ్యూలు, ప్రస్తుతం ఎన్నికలు లేవు గానీ ఉండి ఉంటే సానుభూతి ఓట్లు కూడా జలజలా రాలిపోయేవి.

 

అధికార హస్తం పట్టుకొని తిరిగినంతకాలం సాక్షాత్ కలెక్టరు మీద చేయిచేసుకొన్నాపట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, తమ చేయి వీడిన మరుక్షణమే బీ.సీ.నాటి కేసులన్నీ తిరగదోడించి మరీ ఎండకన్నెరుగని తమని నిర్దాక్షిణ్యంగా జైల్లో వేయించిందని పళ్ళు కొరుకొన్న ఒవైసీ సోదరులకు, కిరణ్ కుమార్ రెడ్డి పై పగ తీర్చుకొనేందుకు నేడు ఒక అపూర్వమయిన అవకాశం వచ్చి ఒళ్లో వాలితే, దానిని వదులుకొంటారని ఎవరూ భావించరు.

 

కానీ, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమయింది కనుక అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అంటూనే, తాము ప్రతిపక్షాలు పెడుతున్న అవిశ్వాసానికి మద్దతు తెలుపుతాము కానీ దాని వల్ల ప్రభుత్వంపై ఏ ప్రభావం ఉండబోదు గనుక తాము వోటింగులో మాత్రం పాల్గొనమని చెప్పారు.

 

రాష్ట్రంలో మునిగిపోనున్న కాంగ్రెస్ పడవలోంచి ముందు జాగ్రత్తగా బయటకి దూకేసిన మజ్లిస్ పార్టీ, జైల్లో ఉన్నపటికీ జగనే మంచోడు అంటూ ఆ పార్టీవైపు నాలుగు రాళ్ళు విసిరి చూసింది. దానికి అటునుండి ‘నిశబ్దంగా జవాబు’ వచ్చింది కూడా. అంటే ఒవైసీ సోదరులు విద్వేష ప్రసంగాలు చేసినప్పుడు అన్నిపార్టీలు విమర్శలు గుప్పిస్తే, వైకాపా మాత్రం నిశబ్దంగా సమర్దించింది. ఒవైసీ సోదరులు కోర్టులు జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడుతుంటే ఎవరూ పట్టించుకోనప్పుడు కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీని వీడిన వారికి ఈ చిత్ర హింసలు తప్పవు అంటూ తమ అనుభవాలని వారితో పంచుకొంటూ సానుభూతి చూపించింది.

 

భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఎన్నికలలో పోటీచేసే ఆలోచనలున్న మజ్లిస్ పార్టీ, మరిప్పుడు వైకాపా పెడుతున్న అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఈయడంలేదో, కాంగ్రెస్ ప్రభుత్వం పై పగ తీర్చుకొనే అపూర్వ అవకాశాన్ని ఎందుకు ఒదులుకొంటోందో అని ధర్మ సందేహాలకు మూడు జవాబులు కనిపిస్తాయి.

 

1. కాంగ్రెస్ పార్టీ చేతిలో చేయేసుకొని తిరిగితే ఎంత సుఖమో, ఆ చేయి వదిలితే అంత కష్టమని అనుభవ పూర్వకంగా తెలుసుకొన్న ఒవైసీ సోదరులు వెంటనే కాకపోయినా, ఎన్నికల లోపు ఎప్పుడయినా తిరిగి కాంగ్రెస్ హస్తం అందుకొనే ఆలోచనలో ఉండవచ్చును. అందువల్ల కిరణ్ ప్రభుత్వానికి బ్యాడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినా, అవిశ్వాసం మాత్రం చూపలేదు. మరి అందుకేనేమో కిరణ్ కుమార్ రెడ్డి కూడా మజ్లిస్ నేతలను మళ్ళీ ఎన్నడూ ఒక్క మాట కూడా అనలేదు.

 

2. జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి విడుదల కాకమునుపే వెళ్లి వాటేసుకోవడం కంటే, ఒకవేళ అతను విడుదల అయితే అప్పుడే వాటేసుకొని దండలు కూడా వేయొచ్చును. లేకుంటే ఏ తెలుగుదేశం పార్టీ వెనుకో పోయినట్లయితే మరే ఇబ్బందీ ఉండదు, అని మరో ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.

 

3. ఒకసారి తొందరపడి ఎదురుదెబ్బలు తిన్నారు గనుక, ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేయకుండా, ఎన్నికల వరకు ఓపికపడితే అప్పటి పరిస్థితులను బట్టి ఏదో ఒక పార్టీని ఆశ్రయించడమో, లేక పరిస్థితులు అనుకూలిస్తే ముందే ప్రతిజ్ఞ చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయవచ్చునని ఆలోచనతోనే ప్రస్తుతం అవిశ్వాసానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఉంటారు. మొత్తం మీద ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసంలోనే విశ్వాసం కూడా ఉందని నిరూపించుతున్నాయి.