మూసీ ఒడ్డున మహాత్మాగాంధీ విగ్రహం.. గాంధీజీ సిద్ధాంతాలకు వ్యతిరేకమంటూ తుషార్ గాంధీ ట్వీట్
posted on: Feb 24, 2026 11:50AM

హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న భారీ గాంధీ విగ్రహ ఏర్పాటును మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ వ్యతిరేకిస్తున్నారు. గాంధీజీ స విగ్రహాలు కాదు ఆయన ఆశయాలు ముఖ్యమని పేర్కొంటూ తుషార్ గాంధీ మూసి ఒడ్డున గాంధీజీ విగ్రహం ఏర్పాటు నిర్ణయంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా రూ. 5000 కోట్లతో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై బాపూజీ ఆశయాలకు విరుద్ధంగా విగ్రహాల కోసం భారీగా ఖర్చు చేయడం, పర్యావరణపరమైన ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించారు.
మూసీ పునరుజ్జీవన పథకం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసి, అభిప్రాయ సేకరణ కోసం సమావేశాలను కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు పెట్టారు. గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజలను వారి నివాసాల నుంచి వెళ్లగొట్టడం సరికాదనీ మహాత్మాగాంధీ బతికి ఉండే ఆయన ఇందుకు అంగీకరించి ఉండేవారు కాదనీ పేర్కొన్నారు. విగ్రహాల కంటే ప్రజల కనీస అవసరాలే ముఖ్యమని గాంధీజీ నమ్మేవారని, అటువంటిది ఆయన విగ్రహం కోసమే పేదల ఇళ్లను తొలగించడం ఆయన సిద్ధాంతాలకు విరుద్ధం తుషార్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.




.webp)
.webp)


