ఇవి తింటే సన్నబడతారు

 

 

 

 

చక్కటి ఆహారాన్ని చూడగానే తినాలనిపిస్తుంది. రుచి చూశాక ఇంకాస్త తిందామనిపిస్తుంది. అంతలోనే క్యాలరీలు కళ్ళముందు త్రీడీ ఎఫెక్టులో కనిపించేసరికి అయ్యబాబోయ్ అంటూ దూరంగా వచ్చేస్తాం. కానీ, మనసు ఓపక్క ఆ రుచుల వెంట పరిగెడుతూనే వుంటుంది. పోనీ, ఏదో ఒకటీ అరా ‘వద్దు’ క్యాలరీలు పెరుగుతాయంటే పోనీలే మన మంచికే కదా అని మానేస్తాం. స్పూను పంచదార నుంచి కప్పు ఐస్ క్రీం దాకా ప్రతీదీ క్యాలరీల తూకం వేసుకుని, ఆచితూచి తినాలంటే ఎలా చెప్పండి. అర్థం చేసుకోరూ! ఇదితో ఇలా నాలా, మీలా జీరో క్యాలరీల కోసం తాపత్రయ పడేవారికోసం ఈమధ్య మార్కెట్లో జీరో కేలరీల స్వీట్లు, డ్రింకులు అంటూ దొరుకుతున్నాయి. ఏది ఏమైనా చెప్పండి... తినాలి అనిపించగానే ఇంకేం ఆలోచించకుండా కడుపునిండా తినగలిగే ఆహారం ఏదన్నా వుంటే బాగుందని అనిపిస్తుంది కదా. అలా తినగలిగే ఆహార పదార్ధాలు కూడా ఉన్నాయండోయ్. అవే ‘నెగటివ్ క్యాలరీ ఫుడ్స్’.


ఇంతకీ ‘నెగటివ్ క్యాలరీ ఫుడ్స్’ అంటే ఏమిటి? ఒళ్ళు తగ్గాలన్నా, మరింత పెరగకుండా చూసుకోవాలన్నా మనలో చాలామందికి తెలిసిన ఏకైక మార్గం నోరు కట్టేసుకకోవడమే. దీనికి భిన్నంగా ఎంత ఎక్కువ ఆహారం తీసుకున్నా బరువు తగ్గడం నెగటివ్ కేలరీ ఫుడ్స్ తో సాధ్యమే అంటున్నారు కొందరు పోషకాహార నిపుణులు. పేరు కొత్తగా అనిపిస్తోంది కానీ, దానిలోని ఆహార పదార్ధాలు మాత్రం మనందరికీ తెలిసిన తాజా పండ్లు, పచ్చి కూరగాయలే. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ ‘నెగటివ్ కేలరీ ఫుడ్స్’ రకానికి చెందిన ఆహారం తీసుకుంటే వాటితో మన శరీరానికి లభించే కేలరీల కంటే, అవి జీర్ణమవడానికి ఖర్చయ్యే శక్తి ఎక్కువట.


‘నెగటివ్ కేలరీ ఫుడడ్స్’ నుంచి లభించే కేలరీల కోసం మన శరీరం బాగా శ్రమించాల్సి వుంటుంది. వివరంగా చెప్పాలంటే, సాధారణంగా మనం తీసుకునే ఆహారం నుంచి లభించే కేలరీల్లో ఓ పదిశాతం వరకూ అది జీర్ణం కావడానికి ఖర్చవుతాయి. దీనికి భిన్నంగా ఈ నెగటివ్ కేలరీ ఫుడ్స్ తో లభించే  కేలరీల కంటే వాటిని శరీరం గ్రహించడానికి మరింత శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల మన శరీరంలో కొవ్వు రూపంలో నిల్వ వున్న శక్తి కూడా ఖర్చవుతుందని, ఫలితంగా బరువు తగ్గుతామని నిపుణులు అంటున్నారు.


మనం తినే ఆహారంలో కొన్ని జీర్ణమవడానికి ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఉదాహరణకు మనకు ఒక రొట్టె నుంచి 400 కేలరీలు లభిస్తాయని అనుకుందాం. అది జీర్ణం కావడానికి 150 కేలరీలు ఖర్చవగా, మిగిలిన 250 కేలరీలు కొవ్వు రూపంలో మారిపోయి శరీరంలో నిల్వ వుంటాయి. అలాగే ఒక యాపిల్ లేదా నారింజలో 50 కేలరీలు వుంటాయనుకుందాం. దాన్ని జీర్ణం చేసుకోవటానికి మన శరీరం 150 కేలరీలు ఖర్చుపెడుతుంది. అంటే, మన శరీరానికి కొత్తగా శక్తి రాదు. పైగా ఇప్పటికే కొవ్వు రూపంలో నిల్వ వున్న కేలరీల నుంచి ఓ వంద కేలరీలు ఖర్చయిపోతాయన్నమాట. అందువల్లే ఇలాంటి పదార్ధాలు ఎంత ఎక్కువ తిన్నా సరే ఒళ్ళు తగ్గుతుందని అంటున్నారు ఈ విధానాన్ని సమర్థించే కొంతమంది పోషకాహార నిపుణులు. ఈ తరహా ఆహార పదార్ధాల్లోని విటమిన్లు, మినరల్స్ జీర్ణక్రియకు ఉపకరించే ఎంజైమ్‌ల ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తాయని చెబుతున్నారు వీరు.

 

‘నెగటివ్ కేలరీ ఫుడ్స్’ విభాగంలోకి వచ్చే ఆహార పదార్థాలు ఏవంటే.. ఆపిల్స్ నిమ్మకాయలు, మామిడిపండ్లు, నారింజ, బొప్పాయి, పనసకాయలు, జామ, పుచ్చకాయ మొదలైనవి. అలాగే బీట్‌రూట్, క్యాబేజ్, పచ్చి బఠానీలు, పాలకూర, టొమోటో లాంటి కూరగాయలు నెగటివ్ ఫుడ్స్ కిందకి వస్తాయట. అంటే మన ఆహారంలో 50 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, ఆ ముప్పై శాతంలో సగం పచ్చివి, సగం వండినవి వుండాలట. ఇవి ఎంత తిన్నా నష్టం వాటిల్లదని గట్టిగా చెబుతున్నారు. అయితే ఈ విధానంపై పోషకాహార నిపుణుల్లో ఇంకా ఏకాభిప్రాయం లేదు. కానీ, అందరూ పళ్ళు, కూరగాయలు ఆరోగ్యానికి మంచివని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు కాబట్టి ప్రయత్నించడంలో తప్పులేదు.