లుకింగ్‌ గ్లాస్ థియరీ

 

మనిషి మనస్తత్వం మనిషికే అంతుచిక్కదు. అందుకోసం వందలాది అధ్యయనాలు, వేలాది పరిశోధనలతో ఏకంగా మనస్తత్వ శాస్త్రాన్నే రూపొందించుకున్నాడు. వాటిలోని ప్రతి పుటా ఆసక్తికరమైనదే! ప్రతి అధ్యయనమూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పేదే! అలాంటి ఒక సిద్ధాంతమే ‘లుకింగ్‌ గ్లాస్ సెల్ఫ్‌’

 

వందేళ్లనాటిది

Looking glass self సిద్ధాంతం ఈనాటిది కాదు. ఛార్లస్‌ కూలే అనే అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త 1902లోనే ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది. ఆయన తన Human Nature and the Social Order అనే పుస్తకంలో భాగంగా దీన్ని ప్రతిపాదించాడు. అంతకుముందు విలియమ్ జేమ్స్ అనే శాస్త్రవేత్త రూపొందించిన సిద్ధాంతానికి కాస్త పొడిగింపుగా ఈ లుకింగ్‌ గ్లాస్ సిద్ధాంతం సాగుతుంది.

 

ఇదీ విషయం

సమాజంలో ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారని మనం భావిస్తామో, దానికి అనుగుణంగానే మన ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని మలుచుకుంటామన్నది ఈ సిద్ధాంతంలోని ముఖ్య విషయం. తన సిద్ధాంతాన్ని ఛార్లెస్‌ కూలే మూడు భాగాలుగా అందించాడు...

1- మనం అవతలివారికి ఎలా కనిపించాలని అనుకుంటున్నామో, ఓ అంచనా వేసుకుంటాం.

2- మన అవతలివారికి అలా కనిపించిన తరువాత, వారు ఎలా ప్రతిస్పందిస్తున్నారు అన్న విషయాన్ని గ్రహించేందుకు ప్రయత్నిస్తాం.

3- అవతలివారికి మన మీద ఏర్పడిన అభిప్రాయాల ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటాం.

 

పొరపాట్లు జరగవచ్చు

మన మీద ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం అనేది మానవ సహజం. మనం సంఘజీవులం కాబట్టి, ఎదుటివారి ప్రతిస్పందనల ఆధారంగానే మనల్ని మనం అంచనా వేసుకుంటాం. ఇందుకోసం మన బాల్యంలో కుటుంబసభ్యుల ప్రతిస్పందన మొదలుకొని, సమాజంలోకి వచ్చిన తరువాత చుట్టుపక్కలవారిని గమనించడం వరకూ ఈ పద్ధతి సాగుతూనే ఉంటుంది. అయితే ఒకోసారి ఈ అంచనాలో మనం ఘోరం విఫలం అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఉదాహరణకు మనం తరగతి గదిలో ఒక లెక్కను తప్పు చెప్పాం అనుకోండి... మిగతా విద్యార్థులు ఆ విషయాన్ని పట్టించుకోకపోయినా, మనం వారి దృష్టిలో ఒక మొద్దుగా ముద్రపడిపోయామన్న భయం కలగవచ్చు. అలాగే ఇతరులు ఏదో ముఖస్తుతి కోసం మనల్ని పొగిడితే, ఆ పొగడ్తే నిజమనీ భ్రమించవచ్చు.

 

ఆత్మవిశ్వాసం!

మన గురించి ఇతరుల ప్రతిస్పందనలని గమనించడం సహజమే అయినా, అది ఒకోసారి మనమీద మనకు ఉన్న నమ్మకాన్నే దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిరంతరం అవతలివారు ఏమనుకుంటున్నారో అన్న ఆలోచనతో బతికితే ఆత్మన్యూనతలో క్రుంగిపోయే ప్రమాదం ఉందని తేల్చి చెబుతున్నారు. ఈ సమాజంలో భాగంగా ఇతరుల మనోభావాలను గమనించుకుంటూ, వారి ఇబ్బంది కలుగకుండా ప్రవర్తించడం అవసరమే! కానీ మనలోని విచక్షణ ఏది మంచి, ఏది చెడు అని బేరీజు వేసుకునే స్థాయికి వచ్చిన తరువాత... ఇతరుల ప్రతిస్పందనల గురించి అతిగా ఊహించుకోవడం, అనవసరమైన ప్రతిస్పందనలకి మన వ్యక్తిత్వాన్ని బలిచేసుకోవడం మంచిది కాదన్న సూచనను ఈ లుకింగ్ గ్లాస్‌ సెల్ఫ థియరీ అందిస్తోంది.

 

- నిర్జర.