Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో స్థానిక ఎన్నికలు.. ఇప్పట్లో లేనట్లే ?
posted on: Jun 22, 2025 10:33AM

ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇక ఇప్పట్లో లేనట్లేనా ? అంటే, అంతే అంటున్నారు, విశ్లేషకులు. ఏదో జరగరానిది జరిగితే ఏమో కానీ, లేదంటే, స్థానిక ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి స్థానిక సంస్థల గడవు ముగిసి ఇంచుమించుగా సంవత్సరం పైనే అయింది. రాష్ట్రంలో2019లో చివరిసారిగా, విడతల వారీగా, మూడు నాలుగు నెలలు పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌ల పదవీకాలం గత సంవత్సరం (2024) ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. అలాగే,ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 3న, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీకాలం అదే సంవత్సరం జూలై 4న ముగిసింది.
మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం గత ఆగష్టులో ముగిసింది ఇక అప్పటి నుంచి పంచాయతీ మొదలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వరకు స్థానిక సంస్థలో, ప్రజా పాలన స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఈనేపధ్యంలో,గత ఫిబ్రవరి నుంచి, ప్రభుత్వం, త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెపుతూ వస్తోంది.అయితే, తాజా పరిణామాలు, మంత్రులు, పార్టీ పెద్దలు చేస్తున్న పరస్పర విరుద్ద ప్రకటనలను గమనిస్తే,స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంలో ప్రభుత్వానికి, పార్టీకి కూడా క్లారిటీ లేనట్లుందని అంటున్నారు. అంతేకాదు, కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మెడ మీద కత్తి పెడితే తప్పించి, ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి మాత్రం లేదని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలోను అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి, చివరకు,మే 2025 చివరకి కల్లా ఎన్నికలు నిర్వహిస్తామని కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన గడవు ముగిసినా,ఇంతవరకు ఎన్నికల ఉలుకూ పలుకూ లేదని,అంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలోనూ,అదే పరిస్థితి కొనసాగినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి ఒకవారం పది రోజుల క్రితం వరకు కూడా, కాంగ్రెస్ వర్గాలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లో స్థానిక ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది.ముఖ్యంగా, ఈ నెలాఖరులోగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన ప్రకటన స్థానిక నేతల్లో జోష్’ పెంచింది.
అయితే కోర్టులో ఉన్న అంశాన్ని తనకు సంబంధం లేని శాఖపై ప్రకటన ఎలా చేస్తారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మంత్రి పొంగులేటిని మందలించినట్లు వార్తలు వచ్చినందున క్రింది స్థాయి నేతల ఉత్సాహం ఒక్కసారిగా చల్లబడి పోయింది.ఎన్నికల నిర్వహణ సందిగ్దంలో పడింది. అంతే కాకుండా, పీసీసీ చీఫ్, తాజాగా, న్యాయస్థానం తీర్పు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, స్పష్టం చేశారు. అంటే, ఇప్పట్లో స్థానికం లేదని చెప్పకనే చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం ప్రకటిస్తూ చట్టబద్దత కోసం కేంద్రానికి పంపింది.దీంతో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ అన్నిటినీ మించి, సర్వేలు, ఇంటెల్జెన్సీ నివేదికలు, ప్రభుతాన్ని,అధికార పార్టీని భయపెడుతున్నాయని అంటున్నారు.ఈ నేపధ్యంలో, స్థానిక సంస్థలఎన్నికలు,ఇప్పట్లో లేనట్లే, అంటున్నారు.






