సంతోషానికి చిట్కా!

 

చాలా రోజుల క్రితం ఓ భార్యాభర్తా ఉండేవారు. వాళ్లిద్దరూ ఉన్నంతలో చాలా సంతోషంగానే ఉండేవారు. కానీ ఆ సంతోషం ఎంత కాలం నిలుస్తుందో అని వాళ్లకి తెగ అనుమానంగా ఉండేది. ఈలోగా వాళ్లుండే ఊరికి ఒక సన్యాసి వచ్చాడని తెలిసింది. ఆయన దగ్గర అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఉంటాయని ప్రచారం జరిగింది. దాంతో తమ సమస్యను ఆ సన్యాసికే విన్నవించుకోవాలని దంపతులిరువురూ బయల్దేరారు.

దంపతుల సమస్య విన్న సన్యాసి పెద్దగా ఆశ్చర్యపడలేదు. పైగా ‘‘నా దగ్గరికి అంతా డబ్బు కోసమో, కీర్తి కోసమో వస్తుంటారు. మీరు ఇలా సంతోషాన్ని కోరుతూ రావడం మంచిదే! అయితే ఇదేమంత తేలికగా నెరవేరే కోరిక కాదు. ఈ ప్రపంచంలో ఎవరైతే సంతోషంగా ఉంటారని మీకు అనిపించిందో వారి దగ్గరకు మీరు వెళ్లండి. ఆ వ్యక్తి వేసుకున్న చొక్కాలో ఒక ముక్క చించి మీ చేతికి చుట్టుకోండి. దాంతో మీరు చిరకాలం సంతోషంగా జీవిస్తారు,’’ అని చెప్పుకొచ్చాడు.

సన్యాసి మాటలు విన్న దంపతులు ‘ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవారు ఎవరా!’ అని వెతుక్కుంటూ బయల్దేరారు. అలా వారు ఒకో ప్రాంతం దాటుకుంటూ ‘దగ్గరలో ఎవరన్నా సంతోషంగా ఉన్నారా!’ అని వాకబు చేసుకుంటూ ఊరూరా తిరగసాగారు.

ఒక చోటకి వెళ్లేసరికి ‘ఫలానా జమీందారు దంపతులు చాలా సంతోషంగా ఉంటారని’ అందరూ చెప్పుకోవడం వినిపించింది. వెంటనే దంపతులు ఆ జమీందారు వద్దకు వెళ్లారు. వాళ్ల మాటలు విన్న జమీందారుగారి భార్య ‘‘మేం నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే... కాకపోతే ఓ చిన్న లోటు. మాకు పిల్లలు లేరు. ఆ విషయం గుర్తుకువచ్చినప్పుడల్లలా మా మనసులు నిరాశలో మునిగిపోతాయి,’’ అంటూ ఒకింత బాధగా చెప్పుకొచ్చింది.

ఆ మాటలు విన్న భార్యాభర్తలు ఉస్సూరుమంటూ తమ యాత్రని కొనసాగించారు. అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత వారికి ‘ఫలానా చోట ఉండే ఓ రైతు చాలా సంతోషంగా ఉంటాడని’ తెలిసింది. వెంటనే ఆ రైతు ఇంట్లోకి ప్రవేశించారు. వారి మాటలు విన్న రైతు ‘నిజంగానే మేం చాలా సంతోషంగా ఉంటాము. కాకపోతే ఒకటే సమస్య. మాకు గంపెడు సంతానం. వారందరినీ సంభాళించలేక ఒకోసారి జీవితం అంటే విరక్తి కలుగుతుంది,’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ రైతు.

రైతు మాటలు విన్న దంపతులు మరోసారి నిరాశపడ్డారు. ఇక ‘సంతోషంగా ఉండే మనిషిని కనుక్కోవడం అసాధ్యం!’ అనుకొని తిరుగుముఖం పట్టారు. దారిలో వారికి ఒక గొర్రెల కాపరి కనిపించాడు. మైదానంలో గొర్రెలని మేపుకుంటూ, పాటలు పాడుకుంటూ గంతులు వేస్తున్న అతన్ని చూసి దంపతులకి అతను చాలా సంతోషమైన మనిషని తోచింది. వెంటనే అతని దగ్గరకు వెళ్లి- ‘నువ్వు చాలా సంతోషంగా ఉంటావా!’ అని అడిగారు.

‘ఓ! నాకు దుఃఖం అనేదే లేదు. జీవితంలో ఏది లభించినా అది భగవంతుని అనుగ్రహంగా భావించి తృప్తి పడుతూ ఉంటాను. జీవనం ముందుకు సాగేందుకు నా వంతు ప్రయత్నంలో ఎప్పుడూ లోటు రానివ్వను. నాకు అవసరం లేనిదాన్ని ఎప్పుడూ దగ్గర ఉంచుకోను. పక్కవాడిని చూసి నా జీవితం కూడా అలా ఉండాలని పోల్చుకోను,’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘మంచిది. మరేమనుకోకుండా నీ చొక్కాలోంచి ఒక ముక్క చించి నాకు ఇవ్వగలవా!’ అని అడిగరు దంపతులు.

ఆ మాటలకి గొర్రెలకాపరి నవ్వుతూ ‘నాకు అసలు చొక్కానే లేదు కదా! ఉన్నదల్లా ఓ కంబళి ఒకటే. దాన్ని చించేస్తే ఇక నాకు ఎండావానల నుంచి రక్షణ ఏది,’ అంటూ నవ్వుతూ తన దారిన తను వెళ్లిపోయాడు.

గొర్రెలకాపరి మాటలను మననం చేసుకుంటూ దంపతులు తమ గ్రామాన్ని చేరుకున్నారు. ఊళ్లోకి అడుగుపెడుతూనే వారు తమ సన్యాసి దగ్గరకు చేరుకుని జరిగిన వృత్తాంతం అంతా చెప్పుకొచ్చారు. ‘నిత్యం సంతోషంగా ఉండే మనిషిని మేం కనుగొన్నాం. కాకపోతే మీరు సూచించినట్లుగా ఆయన చొక్కాలోంచి ఒక ముక్కని తీసుకుని రాలేకపోయాం,’’ అంటూ నిరాశగా చెప్పారు.

‘‘మీరు ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటారని నేను ముందుగానే ఊహించాను. తొడుక్కోవడానికి ఒక చొక్కా కూడా లేనివాడు సైతం సంతోషంగా ఉండగలడు అని నిరూపించడానికే మీకు ఆ లక్ష్యం ఏర్పరిచాను. మీరు నిత్యం మీ చెంత ఉంచుకోవాల్సింది అతని చొక్కా ముక్క కాదు. అతను చెప్పిన మాటలు. అవే మీకు సంతోషానికి మార్గంగా నిలుస్తాయి,’’ అని హితవు పలికాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)


- నిర్జర.