తిండిపోతుల రహస్యం తెలిసిపోయింది!

కొంతమంది తాము ఎంతగా లావు అయిపోతున్నా సరే... ఆహారం మీద ఎలాంటి నియంత్రణా పాటించలేరు. చూసేవాళ్లకి వాళ్లలో ఏదో లోపం ఉందనిపించక మానదు. ‘నాలుకని ఆ మాత్రం అదుపు చేసుకోలేరా!’ అని ఈసడించడమూ వినిపిస్తుంది. నిజానికి పాపం ఇది వారి స్వభావంలోని లోపం కాదంటున్నారు నిపుణులు. మరి వారు చెప్పేది ఏమిటంటే…

 

సన్నగా ఉండేవారికీ, లావుగా ఉండేవారికీ మధ్య ఏదో జన్యుపరమైన తేడా ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని తేల్చేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు ఒక పరీక్షను చేపట్టారు. సర్జరీ ద్వారా పొట్ట తగ్గించుకున్నవారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. సర్జరీ చేయించుకున్నవారి పేగులలో ‘enteroendocrine cells’ అనే కణాలు గణనీయంగా పెరిగినట్లు గమనించారు.

 

మనం తినే ఆహారాన్ని నియంత్రించడంలో ఈ enteroendocrine cells చాలా ముఖ్య పాత్రని పోషిస్తాయి. ఉదరంలోని పైభాగంలో ఉండే ఈ కణాలు పేగులలోకి ఎంత ఆహారం చేరుతోందో గమనిస్తూ ఉంటాయి. పేగులలోకి తగినంత ఆహారం ఉందని వీటికి సూచన అందగానే ‘ఇక తిన్నది చాలు’ అంటూ మెదడుకి ఓ సందేశాన్ని అందిస్తాయి. కొందరిలో ఈ కణాలు చాలా తక్కువగా ఉంటాయట. ఫలితం! ‘ఇక చాలు’ అన్న సూచన వారి మెదడుకి అందదు. దాంతో వారు అవసరానికి మించిన ఆహారాన్ని లాగించేస్తూ ఉంటారు. అలా అధికంగా పేరుకున్న ఆహారమంతా కొవ్వుగా మారి ఊబకాయానికి దారితీస్తుంది.

 

కొవ్వు తగ్గించుకునేందుకు చేయించుకునే బేరియాట్రిక్‌ సర్జరీ వంటి చికిత్సల తర్వాత ఈ enteroendocrine కణాలు పెరగాన్ని గమనించారు. దీంతో... అధికంగా తినడం అనేది మానసికమైన లోపం కాదనీ, అది ఓ శారీరిక రుగ్మత అనీ తేలిపోయింది. అయితే ఈ కణాలను పెంచుకోవడానికి శస్త్రచికిత్సే గతి అనుకోవడానికి లేదు. మున్ముందు మన తిండిని నియంత్రించే ఈ కణాలను కృత్రిమంగా ప్రవేశపెట్టే రోజులు వస్తాయని ఆశిస్తున్నారు. అదే కనుక జరిగితే ఒక చిన్న ఇంజక్షన్‌ ద్వారా మన ఆకలిని హద్దులలో ఉంచుకోవచ్చునేమో!

 

పై పరిశోధన వెలువడిని సమయంలోనే ఫిన్లాండ్‌లోని కొందరు పరిశోధకులు మరో పరిశోధనను కూడా చేపట్టారు. ఏదన్నా ఆహారాన్ని ఆస్వాదించేటప్పుడు మన మెదడులోని endogenous opioid system అనే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ఈ పరిశోధన ఉద్దేశం. మనం కొన్ని రకాల పదార్థాలను తీసుకున్నప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది.

 

అదే పదార్థాన్ని మళ్లీ మళ్లీ తీసుకోవాలని అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది మనకు సంతోషాన్ని కలిగించినా... మద్యం, డ్రగ్స్‌లాంటి పదార్థాలకు బానిసగా మారడానికి కూడా ఈ వ్యవస్థే కారణం. అతిగా ఆహారం తీసుకునేవారిలో ఈ వ్యవస్థ దెబ్బతింటుందని పరిశోధకులు తేల్చారు. దాంతో ఎంత తిన్నా కూడా మనసుకి తృప్తి కలగదంట. దాంతో ఏదిపడితే అది, ఎంతపడితే అంత లాగించేసి ఊబకాయాన్ని కోరి తెచ్చుకుంటారని తేల్చారు.

- నిర్జర.