తనదాకా వస్తే కానీ

అది ఓ మారుమూల పల్లెటూర్లోని చిన్న పెంకుటిల్లు. పెద్దగా సంపద లేకపోయినా ఆ ఇంట్లో సంతోషానికి మాత్రం లోటు లేదు. ఓ భార్యాభర్తా, వారికి ఓ కొడుకూ కూతురు... ఇలా నలుగురూ హాయిగా ఆ ఇంట్లో జీవిస్తుండేవారు. వాళ్లు మిగిల్చిన చిన్నా చితకా ఆహారం మీద ఓ ఎలుక బతుకుతూ ఉండేది. ఇలా ఉండగా ఓ రోజు ఆ ఇంటి యజమాని ఏదో కొత్త వస్తువుని తీసుకురావడం ఆ ఎలుక గమనించింది. అదేమిటా అని తన కన్నంలోంచి చూసిన దాని గుండె పగిలిపోయింది. తనని పట్టేసేందుకు యజమాని ఒక బోను తీసుకువచ్చాడు.

 

ఎలుక లబోదిబోమంటూ పెరట్లోకి పరుగులెత్తింది. ఆ ఇంటి పెరట్లో ఒక కోడి, మేక, పొట్టేలు ఉన్నాయి. ముందుగా కోడి దగ్గరకి వెళ్లి ‘మీ యజమాని నాకోసం ఒక బోను తీసుకువచ్చాడు. అది ఎవరికైనా హాని చేయవచ్చు జాగ్రత్త! వీలైతే దాన్ని నీ కాళ్లతో లాగి అవతల పారేయ్‌,’ అంటూ హెచ్చరించింది ఎలుక.

 

ఎలుక మాటలకు కోడి నవ్వేస్తూ- ‘నీ కోసం తెచ్చిన బోనుతో నాకు ప్రమాదం ఎలా ఉంటుంది. నేను దాని జోలికే పోను. నువ్వే జాగ్రత్త!’ అంది. అయినా ఎలుక తన పట్టు విడవకుండా పక్కనే ఉన్న మేక, పొట్టేలు దగ్గరకు కూడా వెళ్లి ఇదే హెచ్చరికను చేసింది. కానీ వాటి నుంచి కూడా కోడి చెప్పిన జవాబులాంటి సమాధానమే వినిపించింది.

 

తన మాటని ఎవ్వరూ వినకపోగా, తనని హేళన చేయడంతో ఎలుక చిన్నబుచ్చుకొని తన కలుగులోకి చేరింది. ఇక మీదట తనే కాస్త జాగ్రత్తగా ఉండేందుకు నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బోనులో ఏదో పడిన చప్పుడి వినిపించింది. అదేమిటా అని తెలుసుకునేందుకు ఇంటి యజమానురాలు ఆసక్తిగా బయటకి వచ్చింది. అంతే! బోనులో తోక ఇరుక్కుపోయిన ఓ త్రాచుపాము పడగ మీద ఆమె కాలు పడింది. తన తల మీద కాలు పడితే పాము ఎందుకు ఊరుకుంటుంది. వెంటనే యజమానురాలిని ఒక్క కాటు వేసింది.

 

యజమానురాలి అరుపులు విన్న యజమాని వెంటనే పాముని చావబాది, భార్యని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. వైద్యుడు ఏదో చికిత్స చేసి పంపాడే కానీ, రోజులు గడిచేకొద్దీ యజమానురాలి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. భార్యకు నయమయ్యేందుకు భర్త అన్ని ఉపాయాలూ పాటించడం మొదలుపెట్టాడు. అలా ఎవరో అతనికి కోడిమాంసంతో చేసిన కషాయంతో గుణం కనిపిస్తుందని చెప్పగానే వెంటనే పెరట్లోని కోడిని ఒక్క వేటు వేశాడు.

 

రోజులు గడిచినా యజమానురాలి ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ రాలేదు సరికదా మరింత క్షీణించసాగింది. దాంతో ఆమెను ఆఖరిసారి చూసేందుకు దగ్గరి బంధువులంతా తరలి వచ్చారు. మరి వారందరికీ భోజనం ఎలా! అందుకని ఆ రోజు వారికి ఆహారంగా మేకని బలిచ్చారు. ఇక మరో వారం గడిచేసరికి యజమానురాలు కన్నుమూసింది. ఆమె అంత్యక్రియల కోసమని బంధువులతో పాటుగా వీధివీధంతా కదిలి వచ్చింది. ఆ రోజు వారికి ఆహారంగా పొట్టేలు తల తెగిపడింది. ఇదంతా తన కలుగులోంచి చూస్తున్న ఎలుక మాత్రం బతుకుజీవుడా అనుకుంది.

 

‘సంఘంలో బతుకుతున్నప్పుడు, ప్రతి ఒక్కరి సమస్యా ఇతరులని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’ అన్న సూత్రం ఈ కథలో బయటపడుతుంది. కష్టం మనది కాదు కదా! అనుకుని దాన్ని అశ్రద్ధ చేస్తే చివరికి అదే కష్టం మన తలుపు తట్టే రోజు వస్తుంది. అలా కాకుండా తోటివారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే, అది మనకి తెలియకుండానే ఏదో లాభాన్ని అందిస్తుంది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.