తెరాసతో నాకు ప్రాణహాని ఉంది: రేవంత్ రెడ్డి

 

ముషీరాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన నాయిని నర్సింహా రెడ్డి గత ఎన్నికల్లో తనకు కేసీఆర్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానన్నారని తెలిపారు.దీంతో నాయిని నర్సింహా రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సూమోటోగా స్వీకరించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు‌ రేవంత్‌ రెడ్డి కోరారు.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌, సంయుక్త ఎన్నికల ప్రధానాధికారి ఆమ్రపాలిని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ తనకు రూ.10 కోట్లు ఇస్తానన్నారంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రేవంత్ తెలిపారు. నాయిని వ్యాఖ్యల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయాలని.. లేదంటే తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరానన్నారు. నాయిని స్టేట్‌మెంట్ రికార్డు చేసి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.

తన సెక్యూరిటీపై కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డీజీపీ మహేందర్‌రెడ్డిపై నమ్మకం లేదని, నాగార్జునసాగర్‌లో జరిగిన తెరాస నేతల శిక్షణకు మహేందర్‌రెడ్డి వెళ్లారన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ తనను బెదిరించారని,ఇటీవల మంత్రి జగదీశ్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ తనను భౌతికంగా అంతమొందిస్తామని హెచ్చరించారని.. తెరాస సర్కార్‌ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు ఫిర్యాదు చేశానన్నారు. తనకు కేంద్ర భద్రతా సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘం అధికారులను కోరారు.