జీవితాన్ని తట్టుకొని నిలబడాలంటే!

అది ఒక చిన్న ఊరు. ఆ ఊళ్లో రెండు అందమైన ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. వాటి యజమానులు ఇద్దరూ స్నేహితులే. ఆ ఇద్దరు స్నేహితులూ కలిసి ఓ రోజు బజారుకి వెళ్లారు. వస్తూ వస్తూ ఓ రెండు మొక్కలు తెచ్చుకొన్నారు. తీరా ఇంటికి వచ్చాక మొదటి ఇంటి యాజమాని- ‘మనం సరదాగా ఒక పందెం వేసుకుందామా! ఇద్దరం ఒకేరకం మొక్కను తెచ్చుకొన్నాం కదా! వీటిలో ఏది బాగా పెరుగుతుందో చూద్దామా!’ అన్నాడు.

‘ఓ అదెంత భాగ్యం!’ అంటూ సవాలుకి సిద్ధమయ్యాడు రెండో యజమాని.

మొదటి ఇంటి యజమాని పందేన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. తను తెచ్చిన మొక్కని జాగ్రత్తగా నాటాడు. దాని కోసం ఎక్కడెక్కడి నుంచో ఎరువులు తీసుకువచ్చాడు. మూడుపూటలా మర్చిపోకుండా దానికి నీళ్లు పోసేవాడు. మొక్కలు బాగా పెరగడానికి ఇంటర్నెట్‌లో కనిపించే చిట్కాలన్నీ పాటించేవాడు. రెండో ఇంటి యజమాని మాత్రం తన మొక్క విషయంలో చాలా నిర్లిప్తంగా ఉన్నాడు. రోజూ ఉదయం కాస్త నీళ్లు పోయడం మాత్రమే చేసేవాడు.

రోజులు గడిచేకొద్దీ మొదటి ఇంట్లో మొక్క ఏపుగా పెరగసాగింది. దాని ఆకులు నవనవలాడుతున్నాయి. పండ్లు, పూలతో ఆ చెట్టు చూడముచ్చటగా ఉంది. రెండో చెట్టు కూడా బాగానే ఉంది. కానీ మొదటి చెట్టుతో పోలిస్తే అది కాస్త కాంతివిహీనంగా కనిపిస్తోంది. ‘చూశావా! ఒక్క ఆర్నెళ్లలోనే నా చెట్టు ఎలా తయారైందో. ఇక నువ్వు ఓడిపోక తప్పదు,’ అంటూ రెండో ఇంటి యజమానిని రెచ్చగొట్టాడు మొదటి ఇంటి యజమాని. దానికి రెండో యజమాని ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుండిపోయాడు.

ఈ సంభాషణ జరిగిన రోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఏముంది? ముందురోజు వరకూ నవనవలాడుతూ కనిపించిన మొదటి ఇంటి చెట్టు కాస్తా వేళ్లతో సహా పక్కకి పడిపోయింది. రెండో చెట్టు మాత్రం ఏం జరగనట్లు నిబ్బరంగా కనిపించింది.

‘అదేంటి! ఇంత జాగ్రత్తగా పెంచిన చెట్టు ఇలా ఒరిగిపోయింది,’ అంటూ ఏడుపుమొహం పెట్టుకున్నాడు ఆ ఇంటి యజమాని. దానికి రెండో యజమాని చిరునవ్వుతో- ‘నువ్వు చెట్టుని అందంగా, ఎత్తుగా పెంచాలని చూశావు. దానికి పళ్లు, పూలు కాయాలని మాత్రమే చూశావు. అందుకే దాని అవసరానికి మించిన నీళ్లు అందించావు. ఎప్పటికప్పుడు కావల్సిన నీరు అందడంతో దాని వేళ్లు భూమి లోపలకి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. కానీ నేను నాటిని మొక్క ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని సహజంగా ఎదగాలని కోరుకున్నాను. అందుకే దానికి తగినంత సాయం మాత్రమే చేశాను. ఫలితం! నేను నాటిన మొక్క వేళ్లు భూమి లోతుకి వెళ్లాయి. ఎండకి ఎండి, వానకి తడిసి దాని కాండం బలపడింది. గాలివానని సైతం తట్టుకొని నిలబడింది,’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ కథ కేవలం మొక్కలకి సంబంధించింది మాత్రమే కాదు! పిల్లలు కూడా ఇంతే! వారికి ఏ కష్టమూ, లోకజ్ఞానమూ తెలియకుండా అవసరానికి మించిన సౌకర్యాలు అందిస్తుంటే... జీవితంలో అలజడి రేగినప్పుడు తట్టుకోలేరు. అలా కాకుండా వారు స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఇస్తూ, ఒక కంట వారి అవసరాలను కనిపెడుతూ ఉంటే... ఎలాంటి తుఫానునైనా తట్టుకొని నిలబడతారు.

                                  (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.