ఎలా స్పందిస్తారో మీ ఇష్టం!

అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది.

 

వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది.

తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి.

‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా.

‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇట్టే మెత్తబడిపోయింది. చేయి తగిలితే చాలు చితికిపోయే కోడిగుడ్డేమో వేడినీటికి గట్టిపడిపోయింది. ఇక కాఫీ గింజలు మాత్రం తన చుట్టూ ఉన్న నీటిని తన ఉనికితో నింపేశాయి,’ అని చెప్పుకొచ్చింది తల్లి.

తల్లి చేసిన వింత చేష్ట వెనుక ఏదో మంచిమాట దాగి ఉంటుందని అప్పటికి అర్థమైంది కూతురికి.

 

‘మనం కూడా ఇంతే! అప్పటివరకూ ధైర్యంగా ఉన్నవారు కూడా కష్టాలు రాగానే ఇట్టే డీలా పడిపోతారు.. ఆ బంగాళదుంపలా. మరికొందరేమో కష్టాలు ఎదురయ్యేసరికి మొద్దుబారిపోతారు. అప్పటివరకూ సున్నితంగా ఉన్నవారు కూడా రాయిలా మారిపోతారు- కోడిగుడ్డులా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కష్టాలకు ఎదురీదుతారు. ఆ కష్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ల స్వభావంతో, వారి చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది... కాఫీ గింజల్లాగా! ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగింది తల్లి.

కూతురు మారు మాట్లాడకుండా చిరునవ్వుతో కాఫీని ఒక రెండు కప్పుల్లోకి సర్ది, ఒకదాన్ని తన తల్లికి అందించింది. మరోదాన్ని తను ఆస్వాదించేందుకు సిద్ధపడింది... జీవితాంతం!

 

- నిర్జర.