కొత్త భాషని నేర్చుకోవడం తేలికే!

 


భాషంటే భావాలను పంచుకునే సాధనం మాత్రమే కాదు, అది ఒక భిన్నమైన సంస్కృతికి చిహ్నం. అందుకనే ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకునేవారు వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. పైగా ఒకటికి మించి భాషలను నేర్చుకోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ, మెదడు పనితీరు మెరుగవుతుందనీ, విశాలమైన దృక్పథం అలవడుతుందనీ పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మరి మనకి ఏమాత్రం అలవాటు లేని ఒక కొత్త భాషను నేర్చుకొనేందుకు ఉపాయాలు ఉన్నాయా అంటే లేకేం!

 

తరచూ వినిపించే పదాలు

వర్షం, ఊరు, భోజనం, ఇల్లు... ఇలా ప్రతి భాషలోనూ తరచూ వినిపించే పదాలు ఒక వందన్నా ఉంటాయి. ఆ వంద పదాలు నేర్చుకుంటే చాలు, కనీసం మన మనసులో ఉన్న మాటని చెప్పేయవచ్చు అనేలా ఉంటాయి. అలాంటి ముఖ్యమైన పదాలు కొన్నింటిని బట్టీపట్టేయండి. ఒకటికి పదిసార్లు వాటిని రాసి చూసుకుని, అవి మనకు పూర్తిగా వచ్చేవరకూ ఊరుకోవద్దు.

 

చిన్న చిన్న వాక్యాలు

ముఖ్యమైన పదాలు వచ్చిన తరువాత వాటితో చిన్నచిన్న వాక్యాలను నిర్మించే ప్రయత్నం చేయాలి. నీ పేరేంటి? భోజనం చేశారా? వర్షం పడుతోంది! మీ ఇల్లు ఎక్కడ? వంటి వాక్యాలతో సంభాషించే ప్రయత్నం చేయండి. నువ్వు, నేను, నాది, నీది, అప్పుడు, ఇప్పుడు, ఎక్కడ, ఇక్కడ, ఒకటి, చాలా వంటి పదాలను జోడిస్తే వాక్య నిర్మాణం సులభమవుతుంది.

 

వ్యాకరణం జోలికి వద్దు

ప్రతి భాషకీ తనదైన వాక్య నిర్మాణం ఉంటుంది. వాటికి సంబంధించిన వ్యాకరణ సూత్రాలన్నీ బట్టీపట్టాలంటే అయ్యే పని కాదు. భాష నేర్చుకునే సమయంలో చాలామంది చేసే పొరపాటు ముందుగానే వ్యాకరణ సూత్రాలని నేర్చుకునే ప్రయత్నం చేయడం. దాని వల్ల భాష మరింత గందరగోళంలో పడిపోయే ప్రమాదం ఉంది. తెలుగులో కర్త, కర్మ, క్రియ మనకి ఏం తెలుసని ఇంత తప్పులు లేకుండా మాట్లాడుతున్నాం! కాబట్టి భాషని ముందు సహజంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత దాని లోతులను తెలుసుకోవాలి.

 

వింటూ ఉండటమే

భాషని వినడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రం ఇప్పటి తరానికి కొత్త కావచ్చు. కానీ ఒకప్పుడు దూరదర్శన్‌లో వచ్చే హిందీ కార్యక్రమాలను చూస్తూ హిందీ మీదే పట్టుసాధించేవారు. ఎందుకంటే అప్పట్లో చూసేందుకు మరో ఛానల్‌ ఉండేది కాదయ్యే! ఒక భాష నేర్చుకోవాలనే అనురక్తి ఉన్నప్పుడు ఒక పక్క ఆ భాషని నేర్చుకుంటేనే మరోపక్క అందులోని సంభాషణలను ఏదో ఒక రూపంలో వినడం వల్ల చాలా ప్రభావం కనిపిస్తుంది. అవి సినిమాలు కావచ్చు, వార్తలు కావచ్చు, ఆఖరికి నేతల ఉపన్యాసాలు కావచ్చు!

 

ఓనమాలు

భాషలో అక్షరాలు నేర్చుకుని కూడబలుక్కుంటూ అయినా ఓ పది వాక్యాలను చదవగలిగితే కొత్త భాష గాడిలో పడినట్లే. ఒక భాషని చదవడం రాకపోతే, అందులో ఎంత ప్రావీణ్యం ఉన్నా వృధానే! చదువుతూ ఉంటే కొత్త కొత్త పదాలు కనిపిస్తుంటాయి. పక్కన ఓ చిన్న నిఘంటువు ఉంటే ఇక కొన్నాళ్లకి రోజువారీ కనిపించే పదాలన్నింటికీ అర్థం తెలుస్తూ ఉంటుంది.

 

మాట్లాడటం ముఖ్యం

ఒక భాష మీద పూర్తిస్థాయి పట్టుసాధించాలంటే చాలా కాలమే పట్టవచ్చు. మనమేమీ అందులో పుట్టి పెరగలేదు కదా! కాబట్టి సరిగా రాదన్న భయంతోనో, ఎగతాళి చేస్తారన్న సిగ్గుతోనో భాషని మనలోనే దాచుకుంటే ఉపయోగం లేదు. భాషని ఎంతగా సంభాషణా రూపంలోకి తీసుకువస్తే దాని మీద అంత పట్టు పెరుగుతుంది. అందుకోసం ఆ భాష తెలిసిన పరిచయస్తులు ఎవరన్నా ఉంటే వారితో సంభాషించండి. ఎవరూ దొరక్కపోతే ఏదో ఒక అంశం మీద ఒక చిన్న వ్యాసం రాసేందుకు ప్రయత్నించండి. అప్పుడే భాష మీద మనకు ఎంతవరకూ పట్టు ఉందో తేలిపోతుంది.

 

 

- నిర్జర.