TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంతాజ్ కు మంగళం!

Published on: Sat Aug 9, 2025 10:02AM

తిరుపతి సమీపంలో వివాదాస్పద ముంతాజ్ హోటల్ ప్రాజెక్టుకు గత జగన్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపును తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.  ముంతాజ్ హోటల్ కు స్థల కేటాయింపుపై సాధు సంతులు సహా , హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. 

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో తిరుమల విషయంలో  వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.  అందుకే అప్పట్లో అంటే  అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  జగన్ ను తన ప్రియశిష్యుడిగా పేర్కొన్న శారదాపీఠం అధిపతి స్వరూపానంద సర్వస్వతి కూడా ఒక సమయంలో జగన్ హిందూ ధర్మాన్ని, హైందవ సంప్రదాయాన్ని మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిని బట్టే సీఎంగా అధికారంలో ఉండగా ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి హయాంలో  హిందువుల మనోభావాలను పనిగట్టుకుని దెబ్బ తీసేవారనడానికి బోలెడు ఉదాహరణకు కనిపిస్తాయి.  ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత    దేవాలయాల మీద జరిగిన దాడులకు, అన్యాక్రాంతమైన దేవుని ఆస్తులకు లేక్కే లేదని చెప్పవచ్చు. ఆఖరికి తిరుమలలో కూడా అన్యమత ప్రచారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులకు కొలువులు కట్టబెట్టారు.  

ఆగమ శాస్త్రం, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి జగన్ హయాంలో టీటీడీ  ఇష్టారాజ్యంగా తీసుకున్న పలు నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేశాయి.  ఏడుకొందలపై   డ్రోన్లు సంచరించడం మొదలు,   టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పించడం వరకూ జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అరాచకాలకు లెక్కే లేదు.  ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ జగన్ హయాంలో  ఆ హిందూ ధర్మ వ్యతిరేక చర్యలకు నిలయంగా మారిందన్న ఆరోపణలు  వెల్లువెత్తాయి.    

తిరుమల లడ్డూ ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో  జగన్ హయాంలో టీటీడీ తీరు ఉండేదన్న ఆరోపణలు ఉన్నాయి.   అంతే కాదు భక్తులకు   సదుపాయాల విషయాన్ని   అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా విస్మరించింది.  స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు   సమయానుకూలంగా జరిగే ప్రసాద వితరణను నిలిపేసింది.  క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది.   అంతేనా నిత్యం గోవిందనామస్మరణ తప్ప మరో పేరు వినిపించడమే మహాపరాథంగా భక్తులు భావించే తిరుమల కొండపై ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి.  ఇంతగా తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించిన జగన్.. కొండ కింద కూడా తన హిందూ వ్యతిరేకతను ప్రస్ఫుటంగా చాటుకున్నారు.   

2016లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలిపిరి మార్గంలో ఆధ్యాత్మిక‌, సంస్కృతిక‌ కార్యక్రమాలకు వేదికగా దేవలోకం ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించారు. 38 ఎకరాలలో 750 కోట్ల‌ రూపాయలతో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పుడే పాతిక ఎకరాలు కేటాయించారు. ఆ తరువాత 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు మూలనపడింది. అయితే ఈ ప్రాజెక్టు కోసం   కేటాయించిన పాతిక ఎకరాలలో ఓ ఇరవై ఎకరాలను జగన్ ముంతాజ్ హోటల్స్  నామమాత్రపు ధరకు కట్టబెట్టేశారు.  

90 ఏళ్ల పాటు ఏడాదికి రెండు లక్షల రూపాయల చొప్పున  లీజుకు జగన్ ఈ స్థలాన్ని అప్పగించేశారు. ఇప్పుడక్కడ పునాదులు లేచాయి.   తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తొలి సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  టీటీడీ కొత్త పాలక మండలి సమావేశం ఈ కేటాయింపును రద్దు చేయాలని తీర్మానించి.. ఆ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముంతాజ్ హోటల్ స్థల కేటాయింపును రద్దు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పర్యాటక శాఖ అధికారికంగా ముంతాజ్ హోటల్ కు జగన్ హయాంలో జరిపిన స్థల కేటాయింపును రద్దు చేసినట్లు ప్రకటించింది.